పెద్దపల్లిని అభివృద్ధి చేయడమే లక్ష్యం

  • రూ.77 కోట్లతో పట్టణంలో పనులు
  • అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి..
  • రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయరమణారావు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ: పెద్దపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సుందర పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. బుధవారం పెద్దపల్లి పట్టణంలోని 5వ వార్డులో రూ.3.85 కోట్లు, 9వ వార్డులో రూ.2.45 కోట్లు, 10వ వార్డులో రూ.3.24 కోట్లు, 11వ వార్డులో రూ.2.93 కోట్ల యూఐడీఎఫ్ నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ అభివృద్ధి కోసం రూ.62.23 కోట్ల యూఐడీఎఫ్ నిధులు మంజూరు చేయించామని, ఈ నిధులతో పట్టణంలోని వివిధ వార్డుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయని తెలిపారు. గత ఏడాది టీయూఎఫ్ఐడీసీ నిధుల ద్వారా రూ.35 కోట్లు మంజూరు చేయించి అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. అలాగే డీఎంఎస్టీ నిధుల ద్వారా రూ.15 కోట్లు కేటాయించి పలు వార్డుల్లో అభివృద్ధి పనులు వేగంగా చేపట్టినట్లు వివరించారు. పెద్దపల్లి పట్టణంలో రూ.7 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు.

మార్కెట్ అందుబాటులోకి వస్తే వ్యాపారులకు, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కలుగుతాయన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో సహకరించాలని కోరారు. అలాగే పట్టణంలో చేపడుతున్న రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ నాణ్యతను పర్యవేక్షించాలని ఆదేశించారు. అభివృద్ధి వి షయంలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు.

పట్టణంలోని ఏ వార్డులోనైనా ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన సమస్యలు ఉంటే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ సూగిళ్ల మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్ తోపాటు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డుల ప్రజలు పాల్గొన్నారు.