తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్‌..

  • జెన్‌ ఆల్ఫా, జెన్‌ బీటాపైనే నా ఫోకస్‌…
  • విద్యకు బడ్జెట్‌లో 15 శాతం కేటాయించడమే లక్ష్యం..
  • విద్య క‌ర్చు కాదు.. పెట్టుబ‌డి..
  • అర్హత ఉన్న కళాశాలలకు బకాయిలను తప్పకుండా విడుదల చేస్తాం..
  • టాటా భాగస్వామ్యంతో ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేశాం..
  • 55 రోజుల్లో 10,006 మంది టీచర్ల నియామకం
  • 17 మంది విద్యార్థులకు ఒక టీచ‌ర్ ఉన్నారు.
  • ప్రభుత్వ బడులపై నమ్మకం పెరిగింది..
  • పాలిటెక్నిక్‌ల ప్రైవేటీకరణ ప్రచారం పచ్చి అబద్ధం..
  • టీ ష‌ర్టులు వేసుకుంటే జెన్ జెడ్ అయిపోరు
  • కమీషన్లు తీసుకోవాల్సిన అవసరం నాకేంటి?’..
  • ‘రియల్‌ ఎస్టేట్‌ చేసుంటే వేల కోట్లు సంపాదించేవాడిని’..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశ భవిష్యత్‌ తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని తాను బలంగా విశ్వసిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అందరూ జెన్‌ జీ గురించి ఆలోచిస్తుంటే.. తాను మాత్రం జెన్‌ ఆల్ఫా, జెన్‌ బీటా గురించి ఆలోచిస్తున్నానని చెప్పారు. రాబోయే తరాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చుతున్నామని తెలిపారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానాలను రాష్ట్రానికి తీసుకొచ్చి తెలంగాణ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. శాసనసభలో విద్యాశాఖపై జరిగిన సుదీర్ఘ చర్చలో సీఎం మాట్లాడారు. పేదలకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే కీలకమైన విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నానని స్పష్టం చేశారు.

విద్య తనకు ప్యాషన్‌ అని, ఇతర పనులకు సంబంధించిన నిధుల విడుదలలో జాప్యం జరిగినా… విద్యకు సంబంధించిన నిధులను మాత్రం ఎలాంటి ఆలస్యం లేకుండా విడుదల చేయాలని చూస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.

విద్యాశాఖను నా దగ్గరే ఎందుకు ఉంచుకున్నానంటే..

పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేరంటూ కొందరు విమర్శలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. అయితే విద్యాశాఖకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నందునే తానే ఆ శాఖను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. పేదలకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నానన్నారు. విద్యారంగంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, చేయాల్సిన సంస్కరణలు, నిధుల కేటాయింపుపై తాను నేరుగా దృష్టి పెట్టాలని భావించానని తెలిపారు. తెలంగాణలో అత్యుత్తమ విద్యా విధానాన్ని తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకోసం అన్ని వర్గాల నుంచి సూచనలు తీసుకుంటామని చెప్పారు. విద్యారంగంలో ఆధునిక విధానాలను తీసుకురావడానికి ప్రత్యేక విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని, కమిషన్‌ ఇచ్చే విలువైన సూచనలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్‌ విద్యా విధానాన్ని రూపొందిస్తామని వెల్లడించారు.

విద్యకు భారీగా నిధులు..

2023-24 ఆర్థిక సంవత్సరంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యకు రూ.18,955 కోట్లు కేటాయించగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం 2025-26లో రూ.23,729 కోట్లు, 2026-27లో రూ.27,663 కోట్లు కేటాయించిందని రేవంత్‌రెడ్డి వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడేళ్లలో విద్యాశాఖపై అదనంగా రూ.7,654 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

విద్యకు బడ్జెట్‌లో కేటాయింపులను క్రమంగా పెంచుతున్నామని, భవిష్యత్‌లో 15 శాతానికి చేర్చాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. విద్యారంగానికి నిధుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పేదలకు నాణ్యమైన విద్య అందితే వారి జీవితాల్లో మార్పు వస్తుందని, పిల్లల తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని అన్నారు.

28 వేలకుపైగా విద్యాసంస్థలు.. 28.77 లక్షల మంది విద్యార్థులు

తెలంగాణలో పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, పాలిటెక్నిక్‌లు, డిగ్రీ కళాశాలలు, గురుకులాలు తదితరాలను కలుపుకుని మొత్తం 28,163 విద్యాసంస్థలు ఉన్నాయని సీఎం తెలిపారు. వీటిలో 28,77,177 మంది విద్యార్థులు చదువుతున్నారని, 1,57,408 మంది సిబ్బంది సేవలందిస్తున్నారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల విషయానికి వస్తే రాష్ట్రంలో 24,966 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వాటిలో 19,79,614 మంది విద్యార్థులు, 1,24,456 మంది ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. అలాగే 444 ఇంటర్మీడియట్‌ కళాశాలలు ఉండగా.. వాటిలో సుమారు 1.95 లక్షల మంది విద్యార్థులు, 6,359 మంది లెక్చరర్లు ఉన్నారని చెప్పారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాల్సి ఉండగా.. తెలంగాణలో ప్రస్తుతం 17 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారని సీఎం వివరించారు.

పదేళ్లలో 7,857 మంది.. 55 రోజుల్లో 10,006 మంది టీచర్లు

ఉపాధ్యాయ నియామకాల విషయంలో తమ ప్రభుత్వం వేగంగా పనిచేసిందని రేవంత్‌రెడ్డి అన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 7,857 మంది ఉపాధ్యాయులను మాత్రమే నియమించిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చామని తెలిపారు.

కేవలం 55 రోజుల్లో 10,006 మంది ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను పూర్తి చేసి, వారికి హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశామని చెప్పారు. నోటిఫికేషన్‌ జారీ చేయడం నుంచి నియామక ప్రక్రియ పూర్తి చేసే వరకు ఇంత తక్కువ సమయంలో మొత్తం ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణలో గానీ గతంలో లేదన్నారు. ఎలాంటి అవినీతి, చిన్న ఆరోపణకు కూడా తావులేకుండా డీఎస్సీ నియామక ప్రక్రియను పూర్తి చేశామని చెప్పారు. రాజకీయ సంకల్పం, అధికార యంత్రాంగం వేగంగా పనిచేస్తే యువత జీవితాల్లో సంవత్సరాల తరబడి కొనసాగే నిరీక్షణకు తెరపడుతుందని అన్నారు.

ప్రభుత్వ బడులపై పెరిగిన నమ్మకం

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు, ఇంగ్లీష్‌ మీడియం బోధన, మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వ బడులపై ప్రజల్లో నమ్మకం పెరగడంతో కొత్తగా 86 వేల మంది విద్యార్థులు చేరారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ప్రతి మూడు కిలోమీటర్ల పరిధిలో ఒక ప్రాథమిక పాఠశాల ఉండేలా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతోందనే నమ్మకాన్ని ప్రజల్లో మరింత పెంచుతామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేసి, తెలంగాణ పిల్లలను ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేయడమే లక్ష్యమన్నారు.

విద్య పేరుతో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ప్రతి ఏటా వేల కోట్ల దందా చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలాంటి విద్యా వ్యవస్థలకు అడ్డుకట్ట వేసేందుకే ఆధునిక విద్యా విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విద్యా రంగాన్ని సమూలంగా మార్చే విషయంలో ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గబోమన్నారు. విద్యను కేవ‌లం వ్యాపారంగా కాకుండా.. పేద, మధ్యతరగతి పిల్లలకు సమాన అవకాశాలు కల్పించే వ్యవస్థగా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు.

పాలిటెక్నిక్‌ల ప్రైవేటీకరణ ప్రశ్నే లేదు

పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారం వందశాతం పచ్చి అబద్ధమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘పాలిటెక్నిక్‌ల ప్రైవేటీకరణ ప్రశ్నే ఉండదు. పాలిటెక్నిక్‌లు ఇప్పటి వరకు ఎలా ఉన్నాయో.. అలాగే ఉంటాయి’’ అని అన్నారు. పాలిటెక్నిక్‌ మూడేళ్ల డిప్లొమా కోర్సు యథాతథంగా కొనసాగుతుందని, అవసరమైతే జీవో 97లో సవరణలు చేస్తామని చెప్పారు. ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరంలో లేటరల్‌ ఎంట్రీ విధానం కొనసాగుతుందని తెలిపారు. విద్యార్థులకు అన్యాయం చేస్తే తనకు ఏమొస్తుందని ప్రశ్నించారు. అకడమిక్‌ హోదా, మూడేళ్ల డిప్లొమా కోర్సులో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థుల్లో అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు.

స్కిల్‌ యూనివర్సిటీలు.. ఏజెన్సీ భూములపై క్లారిటీ

స్కిల్‌ యూనివర్సిటీల కోసం ఏజెన్సీల భూములను ప్రభుత్వం తీసుకోలేదని రేవంత్‌రెడ్డి తెలిపారు. పైగా 282 ఎకరాల భూమిని అదనంగా ఇచ్చామని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడానికే స్కిల్‌ యూనివర్సిటీలను తీసుకొచ్చామని వివరించారు. స్కిల్‌ యూనివర్సిటీకి ఏఐసీటీఈ అనుమతులు తీసుకుంటున్నామని తెలిపారు. సర్వీసు నిబంధనలను మార్చలేదని, ఒకవేళ మార్పులు చేసినా ఉద్యోగుల హక్కులకు నష్టం కలిగించే నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోదని స్పష్టం చేశారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేయడమే స్కిల్‌ యూనివర్సిటీల ఉద్దేశమన్నారు.

ఐటీఐల అభివృద్ధికి టాటా భాగస్వామ్యం..

తెలంగాణలోని ఐటీఐలను 2024లో టాటా టెక్నాలజీస్‌ భాగస్వామ్యంతో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేసిన విధానాన్నే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి స్కిల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా అమలు చేస్తోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణకు నాలుగు పీఎం-సేతు క్లస్టర్లు లభించాయని చెప్పారు. టాటా సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఐటీఐల అభివృద్ధికి సహకరిస్తోందన్నారు. సాంకేతిక విద్యతో పాటు నైపుణ్య శిక్షణను అనుసంధానం చేసి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెంచడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.

తెలంగాణకు ప్రపంచస్థాయి విద్య….

ప్రపంచస్థాయి విద్యాసంస్థలను తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీఎం తెలిపారు. వచ్చే ఏడాది హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం రాష్ట్రానికి రాబోతోందని చెప్పారు. లండన్‌ విశ్వవిద్యాలయం, నార్త్‌ఈస్ట్రన్‌ విశ్వవిద్యాలయం వంటి సంస్థలను కూడా తెలంగాణకు తీసుకొచ్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన, నైపుణ్యాల అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో వైఎస్సార్‌ హయాంలో ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం తీసుకొచ్చిన విషయాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లిస్తాం

గత ప్రభుత్వం సుమారు రూ.5,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెట్టిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. వాటిలో అర్హత ఉన్న కళాశాలలకు బకాయిలను తప్పకుండా విడుదల చేస్తామని చెప్పారు. విద్యార్థులకు నేరుగా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా చెల్లింపులు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌కు ఇబ్బంది కలగకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవస్థను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యారంగంలోని లోటుపాట్లను సరిదిద్దేందుకు ప్రత్యేక విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా తెలంగాణకు నూతన మార్గదర్శకాలు రూపొందించేందుకు కేశవరావు కమిటీని నియమించామని చెప్పారు. అన్ని వర్గాల నుంచి సూచనలు తీసుకుని ఆధునిక విద్యా విధానాన్ని రూపొందిస్తామని వెల్లడించారు.

‘చదువు ఒక్కటే మన తలరాతను మార్చుతుంది..

చదువు ఒక్కటే మన తలరాతను మార్చగలదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కొన్ని సామాజిక వర్గాలు గతంలో గొర్రెలు, మేకల పెంపకం వంటి సంప్రదాయ వృత్తులకే పరిమితమై చదువుకు దూరమయ్యాయని వ్యాఖ్యానించారు. ఆస్తులు ఉన్నప్పటికీ చదువుకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల కొన్ని వర్గాలు వెనుకబడ్డాయని చెప్పారు. విద్య ద్వారా సామాజిక, ఆర్థిక పరిస్థితులను మార్చుకోవచ్చన్నారు. విద్యార్థులు బీఆర్‌ఎస్‌ నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారొద్దని హితవు పలికారు. ‘‘టీషర్టు వేసుకున్న ప్రతివాడు యువకుడు కాలేడు’’ అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రజలకు ఎలాంటి బాధ లేదని, కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌లకే బాధ ఉందని అన్నారు. ప్రజలు వారి తిక్క కుదిరిందని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

తెలంగాణకు పటేల్‌ అని చెప్పుకొనే ఒకాయన గుంటూరులో చదువుకున్నారని అన్నారు. పటేల్‌తో కొట్లాడే సోదరుల పిల్లలు అమెరికాలో చదువుతున్నారని వ్యాఖ్యానించారు. గుంటూరులో చదివిన ఆయన బండ్లోతు ఉద్యోగానికి కూడా పనికిరాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఇంగ్లీష్‌ వస్తుందని తాను అసూయపడుతున్నానని కొందరు అంటున్నారని, ‘‘ఆయన్ను చూసి అసూయపడేవాళ్లు లేరు.. అసహ్యించుకునేవాళ్లే ఉన్నారు’’ అని సీఎం రేవంత్ అన్నారు. తాను పేదరికంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని, పేద కుటుంబాల పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో తనకు తెలుసని చెప్పారు.

దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు.. కమీషన్లు తీసుకోవాల్సిన అవసరం నాకేంటి?..

తనపై కమీషన్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. తనకు డబ్బుపై కక్కుర్తి లేదని, దేవుడు తనకు అన్నీ ఇచ్చాడని అన్నారు. ‘‘కమీషన్లు తీసుకోవాల్సిన అవసరం నాకేంటి? ఆలోచించేలోపే పదవులన్నీ వచ్చాయి. గత 17 ఏళ్లలో జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వరకు ఎదిగాను’’ అని పేర్కొన్నారు.

డబ్బే తన లక్ష్యమైతే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరమే ఉండేది కాదని, రియల్‌ ఎస్టేట్‌ చేసుకుంటే సరిపోయేదని సీఎం వ్యాఖ్యానించారు. ‘‘నాకే డబ్బులు కావాలంటే రియల్‌ ఎస్టేట్‌ చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్ల తాతను నేను’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తనకు గతంలోనే కోకాపేట, పుప్పాలగూడ, మంచిరేవుల ప్రాంతాల భవిష్యత్‌ విలువపై అవగాహన ఉండేదని రేవంత్‌రెడ్డి చెప్పినట్లు పేర్కొన్నారు. ‘‘ఆ ప్రాంతాలు గోల్డ్‌ మైన్స్‌గా మారకముందే నేను గుర్తించాను. అక్కడే కొనసాగి ఉంటే వేల కోట్ల రూపాయలు సంపాదించేవాడిని’’ అంటూ తన గత రియల్‌ ఎస్టేట్‌ అనుభవాన్ని ప్రస్తావించారు.

తనపై వస్తున్న ‘రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌’ విమర్శలను తప్పించుకోకుండా వాటినే తనకు అనుకూలంగా మలుచుకుంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తనతో ఉన్నవారికి సహాయం చేశానే తప్ప, ఎవరికీ చెడు చేయాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.

‘‘నాకేం పైశాచిక కోరికలు లేవు. ప్రశాంతంగా ఉంటాను కాబట్టే రెండు నిమిషాల్లో నిద్రలోకి వెళ్తాను’’ అని సీఎం వ్యాఖ్యానించారు. దీంతో తనపై వస్తున్న అవినీతి, కమీషన్ల ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించడంతో పాటు.. తన గతాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ ప్రత్యర్థులకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

మూడేళ్ల పాలనను పదేళ్ల పాలనతో పోల్చండి

తమ మూడేళ్ల పాలనను గత పదేళ్ల పాలనతో పోల్చి చూడాలని రేవంత్‌రెడ్డి సూచించారు. భవిష్యత్‌ తరాల మంచి కోసమే సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పారు. సంస్కరణలు చేపట్టేటప్పుడు అనేక ఒత్తిడులు, విమర్శలు రావడం సహజమేనన్నారు. అయితే విద్యార్థులు మంచి వైపు నిలబడాలని సూచించారు. తమ ప్రభుత్వాన్ని దెబ్బతీసి తిరిగి అధికారంలోకి రావడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఫామ్‌హౌస్‌ కుట్రలు ఇక చెల్లవని హెచ్చరించారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చర్చ జరగడం మంచి విధానమేనని, అయితే కొన్ని విషయాల్లో ప్రభుత్వం నేరుగా విధానాలను అమలు చేసిందని చెప్పారు. అలాంటి నిర్ణయాల్లో లోటుపాట్లు ఉంటే ఇకపై వాటిని సవరించుకుంటామని స్పష్టం చేశారు.

జెన్‌ ఆల్ఫా, జెన్‌ బీటా భవిష్యత్‌ కోసమే సంస్కరణలు

‘‘అందరూ జెన్‌ జీ గురించి ఆలోచిస్తే.. నేను జెన్‌ ఆల్ఫా, జెన్‌ బీటా గురించి ఆలోచిస్తున్నా’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత తరంతో ఆగిపోకుండా రాబోయే తరాల అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి తెలంగాణలో అమలు చేస్తామని చెప్పారు. విద్యా రంగంలో ఊహించని మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చే క్రమంలో కొన్నిసార్లు వివాదాలు రావడం సహజమేనన్నారు. అయితే విద్యార్థుల భవిష్యత్‌, విద్యా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. తెలంగాణ విద్యా విధానం దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

‘‘విద్యారంగాన్ని సమూలంగా మార్చుతాం’’

తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం నుంచి ఉన్నత విద్య, సాంకేతిక విద్య, నైపుణ్య శిక్షణ, ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల అనుసంధానం వరకు అన్ని రంగాల్లో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. విద్యకు బడ్జెట్‌లో 15 శాతం కేటాయించాలన్న తన లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమన్నారు. ‘‘దేశ భవిష్యత్‌ తరగతి గదుల్లోనే ఉంది. పిల్లల తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

శనివారానికి అసెంబ్లీ వాయిదా

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగం అనంతరం శాసనసభను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రకటించారు. విద్యా రంగంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతం, ఉపాధ్యాయ నియామకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పాలిటెక్నిక్‌లు, నైపుణ్య విద్య తదితర అంశాలపై సీఎం సుదీర్ఘంగా వివరించారు. అలాగే రాజకీయ అంశాలపైనా తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సీఎం ప్రసంగం అనంతరం సభా వ్యవహారాలను ముగించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌.. శాసనసభ సంప్రదాయాలు, సభా గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. అనంతరం సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మరుసటి రోజు తిరిగి ప్రారంభమయ్యే సమావేశాల్లో ప్రజా సమస్యలు, పెండింగ్‌లో ఉన్న బిల్లులు, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చ కొనసాగనుంది.