నల్ల నర్సింహులు పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం

నల్లబెల్లి, ఆంధ్రప్రభ: నిజాం రజాకార్ల అరాచకాలు, రాచరిక పాలన, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నల్ల నర్సింహులు చూపిన ధైర్యసాహసాలు నేటి యువతకు ఆదర్శమని బీసీ హక్కుల సాధన సమితి, పద్మశాలి సంఘం నాయకులు కడియాల క్రాంతికుమార్‌, బొద్దుల దశరథం, బోగ భద్రయ్య, బొద్దుల నర్సయ్య, క్యాతం మొగిళి అన్నారు.

నల్లబెల్లి బస్టాండ్‌ ఆవరణలో నల్ల నర్సింహులు 33వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతాంగ సాయుధ పోరాట ఫలితంగా భూస్వామ్య దోపిడీకి అడ్డుకట్ట పడిందని, లక్షలాది ఎకరాల భూమి పేదలకు దక్కిందని పేర్కొన్నారు. అణగారిన వర్గాల్లో ఆత్మగౌరవం పెంపొందిందన్నారు.

ప్రైవేటు ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన నల్ల నర్సింహులు.. విసునూరు రామచంద్రారెడ్డి దొర ఆగడాలను ఎదిరించేందుకు కమ్యూనిస్టు పార్టీలో చేరి సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రజల హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని, యువత ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పల్లికొండ రవి, వైనాల వీరాస్వామి, ఆకుల సాంబరావు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.