విశాఖపట్నం, మార్చి 6 : తాను రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు రావడం సంతోషదాయకమని తెలిపారు. చంద్రబాబుకు, తనకు మధ్య వైరం ఉందని అందరూ అనుకుంటుంటారని, అది నిజమేనని వెల్లడించారు.
“కానీ ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు కదా… అవన్నీ మర్చిపోయి కాలంతో పాటే ముందుకు వెళుతుండాలి… భవిష్యత్తు అనేది ఆశాజనకంగా ఉండేలా చూసుకోవాలి… అలాగని నాకేం కోరికలు లేవు స్వామీ! ఎవరు ఔనన్నా కాదన్నా నాకు, చంద్రబాబుకు మధ్య వైరం ఉండేది… అది గతం. వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలని చంద్రబాబు చేసే కృషికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను” అని దగ్గుబాటి వివరించారు.
