మాజీ సైనికుల అనుభవాలు దేశాభివృద్ధికి దోహదపడాలి

  • త్యాగధనుల సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌

నరసన్నపేట, ఆంధ్రప్రభ: దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ బాధ్యతలు నిర్వర్తించిన మాజీ సైనికులు, పదవీ విరమణ అనంతరం తమ అనుభవాలను సమాజ అభ్యున్నతికి వినియోగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపునిచ్చారు. సైనికుల దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం యువతకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.

నరసన్నపేటలోని ఎన్‌ఏఆర్‌ హాల్‌లో త్రివిధ దళాల విశ్రాంత సైనికుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నరసన్నపేట సమన్వయకర్త పోకతోట సింహాచలం ఆధ్వర్యంలో, శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పీవీఎన్‌ మాధవ్‌ ముఖ్య అతిథిగా, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌. ఈశ్వరరావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు సత్యవరం కూడలి నుంచి సభా ప్రాంగణం వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ.. ఎండ, వాన, చలి వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ సరిహద్దుల్లో సైనికులు అందించే సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. వారి త్యాగాల వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారని అన్నారు. దేశం కోసం సేవలందించిన మాజీ సైనికులకు సమాజంలో సముచిత గౌరవం కల్పించాలని, సైనిక జీవితంలో అలవర్చుకున్న క్రమశిక్షణ, అంకితభావం, నాయకత్వ లక్షణాలను సామాజిక సేవలోనూ ప్రదర్శించాలని సూచించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మాజీ సైనికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని నాయకులు తెలిపారు. ఒకే ర్యాంకు–ఒకే పింఛను విధానం, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు వైద్య సేవలు, పునరావాసం, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలను ప్రస్తావించారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోకతోట సింహాచలం మాట్లాడుతూ.. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్య సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రత పరిరక్షణలో మాజీ సైనికుల అనుభవాలు సమాజానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మాజీ సైనికులు ఎదుర్కొంటున్న పింఛను, వైద్యం, పునరావాసం, ఉపాధి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆయా సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

దేశ నిర్మాణం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని నాయకులు పేర్కొన్నారు. మాజీ సైనికులు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ యువతలో దేశభక్తి భావాలను పెంపొందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం, రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, జిల్లా ఇన్‌చార్జి ఎస్వీఎస్‌ ప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు పైడి సింధూర, ప్రధాన కార్యదర్శులు చింతు పాపారావు, పెడాడ సూరపునాయుడు, మాజీ సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.