పట్టుదలకు ప్రతిరూపం.. 28 ఏళ్ల సాహసం..

ఆంధ్రప్రభ :

ప్రపంచాన్ని చుట్టి రావాలన్నది చాలామందికి ఓ కల మాత్రమే. ఆలోచన వచ్చినా.. ఆచరణలో సాధ్యం కాదనుకుని పక్కనపెట్టేస్తారు. కానీ బ్రిటన్‌కు చెందిన కార్ల్‌ బుష్బీ మాత్రం ఆ కలను నిజం చేసుకోవాలని పట్టుబట్టాడు. అందుకోసం తన జీవితంలో దాదాపు మూడు దశాబ్దాలను వెచ్చించాడు.

విమానం, రైలు, కారు.. ఇలా ఏ మోటారు వాహనాన్నీ ఉపయోగించకుండా ప్రపంచాన్ని చుట్టి రావాలని నిర్ణయించుకున్నాడు. అడవులు, ఎడారులు, మంచు సముద్రాలు, అంతర్జాతీయ సరిహద్దులు.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సుమారు 50 వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. చివరకు త‌న ప్ర‌యాణాన్ని ముగించుకుని దాదాపు 28 ఏళ్ల తర్వాత తన ఇంటికి చేరుకున్నాడు. 57 ఏళ్ల వయసులో స్వస్థలమైన ఉత్తర ఇంగ్లండ్‌లోని హల్‌ నగరానికి చేరుకున్న ఆయనకు వందలాది మంది ఘన స్వాగతం పలికారు.

చిన్ననాటి కష్టాల నుంచి సాహసికుడిగా..

1969 మార్చిలో హల్‌ నగరంలో జన్మించిన కార్ల్‌ బుష్బీ.. సట్టన్‌ పార్క్‌ ప్రాంతంలో పెరిగాడు. తండ్రి సైన్యంలో పనిచేయడంతో కుటుంబంలోనూ సాహసాలకు కొంత ప్రాధాన్యం ఉండేది. అన్నయ్య కూడా సైన్యంలో చేరాడు. బుష్బీ బ్రిటిష్‌ సైన్యంలోని ప్యారాచూట్‌ రెజిమెంట్‌లో చేరి 12 ఏళ్లపాటు పనిచేశాడు. అక్కడ అలవర్చుకున్న క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, పట్టుదలే తర్వాత ప్రపంచ పాదయాత్రకు పునాదిగా మారాయి.

ప్రపంచ యాత్ర ఆలోచనకు బీజం వేసింది తండ్రి పంపిన ఓ పుట్టినరోజు కార్డు. లండన్‌ నుంచి న్యూయార్క్‌ వరకు బెరింగ్‌ జలసంధి మీదుగా నడిచి వెళ్లడం సాధ్యమేనా? అని సైనికులు చర్చించుకున్న విషయాన్ని తండ్రి అందులో ప్రస్తావించాడు. ఆ మాట బుష్బీని ఆలోచింపజేసింది. ప్రపంచ పటాన్ని ముందుంచుకుని దక్షిణ అమెరికా చివరి అంచు నుంచి ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్‌ మీదుగా బ్రిటన్‌కు చేరుకునే మార్గాన్ని గీసుకున్నాడు. ఆ ఆలోచననే జీవిత లక్ష్యంగా మార్చుకున్నాడు.

‘గోలియత్‌ ఎక్స్‌పెడిషన్‌’కు శ్రీకారం..

1998 నవంబరు 1న దక్షిణ చిలీలోని పుంటా అరెనాస్‌ నుంచి తన సాహసయాత్రను ప్రారంభించాడు. దీనికి ‘గోలియత్‌ ఎక్స్‌పెడిషన్‌’ అని పేరు పెట్టాడు. టెంట్‌, కొద్దిపాటి డబ్బు, ఓ సాధారణ కెమెరా, అవసరమైన సామగ్రితో తోపుడు బండితో ప్రయాణం మొదలుపెట్టాడు. దానికి ‘ది బీస్ట్‌’ అని పేరు పెట్టుకున్నాడు. ప్రపంచమంతా తిరిగి మళ్లీ హల్‌లోని తన ఇంటికి చేరుకునే వరకు ఎలాంటి మోటారు వాహనాన్నీ ఉపయోగించకూడదన్నది అతడి ప్రధాన నియమం.

మొదట ఈ యాత్రను సుమారు 10 నుంచి 12 ఏళ్లలో పూర్తి చేయవచ్చని భావించాడు. దక్షిణ, మధ్య అమెరికాల మీదుగా ఉత్తర అమెరికాకు చేరుకుని.. అక్కడి నుంచి అలాస్కా గుండా రష్యాలోకి ప్రవేశించాడు. అనంతరం మంగోలియా, చైనా, ఆసియా దేశాల మీదుగా యూరప్‌ చేరుకుని బ్రిటన్‌కు పయనమయ్యాడు. మొత్తంగా నాలుగు ఖండాలు, 30 దేశాల మీదుగా సుమారు 31 వేల మైళ్లు.. అంటే దాదాపు 50 వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. అయితే ఈ 28 ఏళ్ల త‌న ప్ర‌పంచ యాత్ర‌లో… వీసాలు, అనుమతులు, ప్రయాణ ఏర్పాట్లు, నిధుల సమీకరణ కోసం పలుమార్లు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. మొత్తం కాలంలో సుమారు 15 ఏళ్లు మాత్రమే నడకకు వెచ్చించినట్లు బుష్బీ వెల్లడించాడు.

బెరింగ్‌ జలసంధిలో మృత్యువుతో పోరాటం..

బుష్బీ యాత్రలో అత్యంత ప్రమాదకరమైన ఘట్టాల్లో ఒకటి అలాస్కా నుంచి రష్యాకు వెళ్లే బెరింగ్‌ జలసంధిని దాటడం. 2006లో ఫ్రాన్స్‌కు చెందిన మరో సాహసికుడు డిమిత్రి కీఫర్‌తో కలిసి గడ్డకట్టిన సముద్రంపై ప్రయాణించాడు. మంచు పలకలు కదులుతున్న పరిస్థితుల్లో స్లెడ్జ్‌లను లాక్కుంటూ ముందుకు సాగారు. మైనస్‌ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో గడ్డకట్టే చలిని తట్టుకోవాల్సి వచ్చింది. పలుచోట్ల మంచు బీటలు వారడంతో సముద్రంలో పడిపోయే ప్రమాదం ఎదురైంది. ఓ దశలో ధ్రువపు ఎలుగుబంటి కూడా కనిపించింది. ఎట్టకేలకు రష్యా తీరానికి చేరుకున్నప్పటికీ.. అక్రమంగా సరిహద్దు దాటారన్న కారణంతో అక్కడి అధికారులు ఇద్దరినీ నిర్బంధించారు.

మధ్య అమెరికాలోని డారియన్‌ గ్యాప్‌ అడవుల ప్రయాణం కూడా అంత తేలికగా సాగలేదు. కొలంబియా, పనామా మధ్య విస్తరించిన ఈ దట్టమైన వర్షారణ్యంలో ప్రమాదకర పరిస్థితులు, ముఠాల సంచారం మధ్య ముందుకు సాగాల్సి వచ్చింది. అక్కడి సరిహద్దు దాటిన ఘటనలో రెండు వారాలకు పైగా నిర్బంధంలో ఉండాల్సి వచ్చింది. మెక్సికోలో ఓ సందర్భంలో తుపాకీతో బెదిరింపులు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని వదులుకోలేదు.

వీసా చిక్కులు.. రాజకీయ అడ్డంకులు..

బుష్బీకి ప్రకృతి సవాళ్లతోపాటు ప్రభుత్వ నిబంధనలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు కూడా పెద్ద సమస్యగా మారాయి. ముఖ్యంగా రష్యాలోకి ప్రవేశించేందుకు అవసరమైన వీసాలు, అనుమతుల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. 2012లో వీసా నిరాకరణకు గురైనప్పుడు తన వాదనను వినిపించేందుకు లాస్‌ఏంజెలెస్‌ నుంచి వాషింగ్టన్‌ డీసీ వరకు నడుచుకుంటూ వెళ్లాడు. మరోవైపు సరిహద్దుల మూసివేతలు, యుద్ధాలు, మారుతున్న రాజకీయ పరిస్థితులు అతడి ప్రయాణ ప్రణాళికలను తారుమారు చేశాయి.

2024లో కాస్పియన్‌ సముద్రాన్ని ఈదుకుంటూ దాటడం మరో అసాధారణ సాహసం. రష్యా మీదుగా తిరిగి వెళ్లడం లేదా ఇరాన్‌ మార్గాన్ని ఎంచుకోవడం సాధ్యం కాకపోవడంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. సుమారు 300 కిలోమీటర్ల మేర నెల రోజులపాటు ఈత కొడుతూ సముద్రాన్ని దాటాడు. ఎడారుల్లో రోజుల తరబడి ఒకే తరహా దృశ్యాలు కనిపించడం, ఆర్కిటిక్‌ ప్రాంతంలో అంతులేని మంచు విస్తీర్ణం మధ్య ప్రయాణించడం మానసికంగానూ సవాలుగా ఉండేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

12 ఏళ్ల యాత్రకు 28 ఏళ్లు ఎందుకు పట్టింది?

ప్రారంభంలో అనుకున్న గడువుతో పోలిస్తే యాత్ర పూర్తి కావడానికి చాలా ఎక్కువ సమయం పట్టింది. దీనికి ప్రధాన కారణం వీసాలు, సరిహద్దు అనుమతులు, నిధుల కొరత. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా యాత్రకు సహకరిస్తున్న స్పాన్సర్లు వెనక్కి తగ్గారు. తర్వాత కరోనా మహమ్మారి కూడా ప్రయాణానికి ఆటంకంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో అనుమతుల కోసం నెలలు, సంవత్సరాలపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. యాత్రలో సగం సమయం ప్రకృతి సవాళ్లను ఎదుర్కోవడానికే కాకుండా.. అధికారిక అనుమతులు, అంతర్జాతీయ నిబంధనలతో పోరాడటానికే సరిపోయిందని బుష్బీ ఓ సందర్భంలో పేర్కొన్నాడు.

ఈ ప్రయాణంలో ఆయనకు మరో చిక్కు ఎదురైంది. యూరప్‌ నుంచి బ్రిటన్‌కు చేరుకునేందుకు ఉన్న ఛానల్‌ టన్నెల్‌ మార్గంలో నడిచి వెళ్లేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో చివరి అడ్డంకిని అధిగమించేందుకు ఇంగ్లిష్‌ ఛానల్‌(ఇంగ్లండ్‌ (బ్రిటన్‌)కు, ఫ్రాన్స్‌కు మధ్య ఉన్న సముద్ర భాగం)ను ఈదుకుంటూ దాటాలని నిర్ణయించుకున్నాడు. గత నెలలో మూడు రోజుల వ్యవధిలో మొత్తం 20 గంటలపాటు నీటిలో ఈదుతూ ఫ్రాన్స్‌ నుంచి బ్రిటన్‌ చేరుకున్నాడు. డోవర్‌లోని షేక్స్‌పియర్‌ బీచ్‌ వద్ద ఒడ్డుకు చేరిన తర్వాత హల్‌ వరకు మిగిలిన సుమారు 400 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన పూర్తి చేశాడు.

పదేళ్ల తర్వాత తల్లి చెంతకు..

నవంబరు 2న హల్‌ నగరానికి చేరుకున్న బుష్బీకి క్వీన్‌ విక్టోరియా స్క్వేర్‌లో వందలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులు స్వాగతం పలికారు. 28 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తన స్వస్థలానికి చేరుకున్న ఆనందాన్ని వారితో పంచుకున్నాడు. “28 ఏళ్ల తర్వాత ఇంతకంటే ఎక్కువగా ఇంకేం ఆశించగలం” అంటూ అక్కడికి వచ్చిన వారితో అన్నాడు. దాదాపు పదేళ్లుగా చూడని తల్లి ఏంజెలాను కలుసుకున్న క్షణం ఆయనకు అత్యంత భావోద్వేగంగా మారింది. ‘వెల్‌కమ్‌ హోమ్‌ సన్‌’ అనే బ్యానర్‌ మధ్య తల్లి కుమారుడిని ఆలింగనం చేసుకుంది. 36 ఏళ్ల కుమారుడు ఆడమ్‌తోనూ బుష్బీ తిరిగి కలుసుకున్నాడు. 12 ఏళ్ల మనవరాలిని తొలిసారి కలిశాడు. ప్రపంచమంతా తిరిగి చివరకు చేరుకోవాలనుకున్న గమ్యం తన తల్లి ఇల్లేనని ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యాడు.

‘ప్రపంచమే నాకు అండగా నిలిచింది’

ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాల గురించి బుష్బీ మాట్లాడుతూ.. తాను ఒక్కడినే ఈ యాత్ర చేయలేదని చెప్పాడు. మార్గమధ్యంలో పరిచయమైన ఎంతోమంది అపరిచితులు చూపిన ఆదరణ, సహాయం తనను ముందుకు నడిపించాయని తెలిపాడు. ఆహారం, వసతి నుంచి ప్రయాణానికి అవసరమైన సహకారం వరకు ఎంతోమంది అండగా నిలిచారని గుర్తుచేసుకున్నాడు. ప్రపంచంలోని వ్యక్తులు, దేశాలు చూపిన దయ వల్లే ఈ రోజు స్వస్థలానికి చేరుకోగలిగానని పేర్కొన్నాడు. దాదాపు మూడు దశాబ్దాలపాటు సాధారణ జీవితానికి దూరంగా గడిపిన తనకు తిరిగి రోజువారీ జీవనానికి అలవాటు పడటం కూడా ఓ సవాలేనని అభిప్రాయపడ్డాడు.

బుష్బీ సాహసయాత్రపై పూర్తి నిడివి గల డాక్యుమెంటరీ నిర్మాణంలో ఉంది. రానున్న వారాల్లో ఇంగ్లండ్‌ అంతటా ప్రసంగ పర్యటనలు చేపట్టేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రపంచాన్ని చుట్టి రావాలన్న ఓ ఆలోచనను జీవిత లక్ష్యంగా మార్చుకుని.. అడ్డంకులు ఎన్ని ఎదురైనా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగిన కార్ల్‌ బుష్బీ కథ, పట్టుదలకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది.