వేటకు మత్స్యకారులు సెలవు
(లావేరు, ఆంధ్రప్రభ ) : కోస్తా సముద్ర తీర ప్రాంతం బోసిపోయింది. వేటకు వెళ్లే మత్స్యకారులు హడావుడి లేదు. బీచ్ లన్నింటికి తాళాలు పడ్డాయి. సముద్ర స్నానాల సందడి లేదు.. మోంథా తుపాన్ (MonthaCyclone) హెచ్చరికతో మత్స్యకారులు వేటకు వెళ్లడం లేదు. తుపాను తగ్గి ప్రకృతి సహకరించినంత వరకు తీర ప్రాంతంలో వేటకు వెళ్ళమని మత్స్యకారులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు రెండు లక్షల మందికి పైగా మత్స్యకారులు ఉన్నారు.
వీరిలో సుమారుగా 16,569 మంది మత్స్యకారులు సముద్రంలో చేపల వేట పై ఆధారపడి బతుకుతున్నారు. వీరు సాగర గర్భంలోకి వెళ్తారు. ప్రకృతి విపత్తులతో ప్రభుత్వం (Government) విధించే వేట నిషేధకాలంలో వీరికి కష్ట కాలం ఎదురవుతుంది. దళారుల దగ్గర డబ్బును తెచ్చుకుని కాలం గడుపుతుంటారు. ఏటా రెండు నెలలు మత్స్య సంపద పునరుత్పత్తి కారణంగా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. ఈ రెండు నెలల కాలంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరు. సముద్రంలో చేపల సంతానోత్పత్తి పెరగడంతో పాటు అప్పటికే ఉన్న సంపద మరింతగా పెరుగుతుంది.
అప్పుడే మత్స్యకారులు రోజు వేటకు వెళుతుంటారు. గంగమ్మ తల్లిని నమ్ముకుని వారాల కొద్ది వేట సాగించి మత్స్య సంపదను తెచ్చుకుంటారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఆ మత్స్యకారులది. నాలుగైదు రోజులు వేటకు వెళ్లకుండా ఉంటే ఎంతో నష్టపోతామని మత్స్యకారులు చెబుతున్నారు. వేకువ జామునే బయలు దేరుతున్న మత్స్యకారుల (fishermen) కు ఆ కుటుంబ సభ్యులు ఎదురై వెళ్లి మత్స్య సంపదతో రావాలని ఆ గంగమ్మ తల్లిని వేడుకుంటారు. కుటుంబ యజమానులు ఇంటికొచ్చినంతవరకు మహిళలు సాగరానికి నమస్కారం పెడుతూనే ఉంటారు.
తుపానులు వచ్చాయంటే అవి తగ్గినంతవరకు సంబంధిత అధికారులు సముద్రం మీదకు వెళ్ళమనేంతవరకు ఇళ్లల్లోనే ఉంటారు. కొంతమంది మత్స్యకారులు పస్తులు ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా సముద్ర స్థానాలకు అనుమతులు లేకపోవడంతో పర్యాటకులు వెనుకకు తిరిగి వెళ్ళిపోయారు. ఏది ఏమైనాప్పటికీ ఈ మోంథా అటు జనంపైనా.. ఇటు మత్స్యకారులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.

