గుండెవ్యాధితో బాలుడి అవస్థలు.. జనసేన నేతల ఆర్థికసాయం..

గుండెవ్యాధితో బాలుడి అవస్థలు.. జనసేన నేతల ఆర్థికసాయం..

నర్సాపురం, ఆంధ్ర ప్రభ : రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. కొప్పర్రు గ్రామం 1వ వార్డుకు చెందిన పోలిశెట్టి వెంకటేశ్వర రావు, అరుణ దంపతుల ఏకైక కుమారుడు పోలిశెట్టి సాయి (13) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా… గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. అతిసామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన బాధితుడి తల్లిదండ్రులు వైద్య చికిత్సకు అవసరమయ్యే సొమ్ములు కూడగట్టలేక మదనపడుతున్నారు.

తమ ఒక్కగానొక్క కొడుకు గుండెకు రంధ్రం పడి అనారోగ్య బారిన పడటంతో తల్లిదండ్రుడు తల్లడిల్లిపోయారు. పేద హృదయాలు కన్నీరు మున్నీరయ్యాయి. పెద్ద ఆసుపత్రిని సంప్రదించగా… ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య చికిత్స చేయవచ్చనడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే వైద్య పరీక్షల సమయంలో మరో సమస్య తలెత్తింది. గుండె బాగా నెమ్మదిగా కొట్టుకుంటుందని, పరికరం అమార్చాలని, ఆరోగ్యశ్రీకి వర్తించదని సుమారు లక్ష రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. వైద్యులు చెప్పిన మాటలకు కూలీపనికి వెళితే కానీ పూట గడవని పేద దంపతులు తీవ్ర మనో వేదనకు లోనయ్యారు. గ్రామ పెద్దలను కలిసి తమ కష్టాన్ని తెలియజేశారు. గ్రామపెద్దలు, దాతలు సుమారు లక్ష రూపాయలు ఆర్థిక సహాయంగా అందించారు. కుమారుడి వైద్య ఖర్చుల నిమిత్తం దాతలు, గ్రామ పెద్దలు అందించిన సహకారానికి పేద దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

జనసైనికులు బాధితుడికి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. కష్టకాలంలో ఆదుకోవడానికి ముందుకు వచ్చే జన సైనికులు మరో అడుగు ముందుకువేసారు. బాధితుడి వైద్య ఖర్చుల నిమిత్తం జనసేన పార్టీ తరఫున రూ.52,000లు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.
జనసేన నాయకులు పోలిశెట్టి శ్రీనివాస్, రావూరి సురేష్ కుమార్, పోలిశెట్టి గణేశ్వర రావు, పిప్పళ్ళ సత్యశ్రీ (పార్టీ ప్రెసిడెంట్), పోలిశెట్టి వీర రాఘవులు, పోలిశెట్టి కొండ, పోలిశెట్టి రంగనాయకులు, పోలిశెట్టి బుల్లి సత్యం, చిన్న నాని, జనసైనికులు, కూటమి నాయకులు, హనుమాన్ యూత్ సభ్యులు బాధితుని నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధితుడు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని జనసేన నాయకులు ఆకాంక్షించారు.