డీఎస్సీపై గోబెల్స్ ప్రచారాన్నే నమ్ముకున్న ‘గొడ్డలి పార్టీ’
- నారా లోకేష్ ఎదుగుదలను చూసి ఓర్వలేకే జగన్ ముఠా విషప్రచారం
- ఆర్మీకి చేసిన సైనికుడిపై దాడులు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు
- ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు
- మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మండిపాటు
అన్నమయ్య, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమర్థ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ స్పష్టం చేశారు. రైతాంగానికి సాగునీరు అందించే ప్రాజెక్టుల నుంచి పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పన వరకు రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా నాయకుల దిగజారుడు రాజకీయంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘యువగళం’ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారని శ్రీకాంత్ తెలిపారు. గత వైకాపా ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ వేయలేదు, ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని విమర్శించారు. కానీ చంద్రబాబు నాయుడు తొలి సంతకంతో మెగా డీఎస్సీ తెచ్చారని, వైకాపా నాయకులు కోర్టుల్లో 200కు పైగా కేసులు వేసి అడ్డుపడినా, మంత్రి లోకేష్ అహర్నిశలు శ్రమించి 148 రోజుల్లో 16,347 మందికి నియామక పత్రాలు అందేలా రికార్డు సృష్టించారని కొనియాడారు.
మాజీ సైనికుడిపై దాడి సిగ్గుచేటు
కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులపై వైకాపా పైశాచికత్వం ప్రదర్శిస్తోందని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సరిహద్దుల్లో 20 ఏళ్లు సేవలుందించి, రీ-టెట్, బీఎడ్ పూర్తి చేసి స్పోర్ట్స్ కోటాలో నిజాయితీగా ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన మాజీ సైనికుడు చక్రపాణి రెడ్డిని సాక్షి ప్రతినిధులు వేధించడం, పాఠశాలలోకి చొరబడి బెదిరించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు. ఇలాంటి అరాచక శక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు
ఏడెనిమిదేళ్లు రాత్రింబవళ్లు కష్టపడి, ప్రతిభతో మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన 16 వేల మంది అభ్యర్థుల ఆత్మగౌరవాన్ని వైకాపా కించపరుస్తోందని మండిపడ్డారు. దీనికి నిరసనగానే కర్నూలు, విశాఖపట్నం, విజయవాడల్లో డీఎస్సీ అభ్యర్థులు స్వచ్ఛందంగా భారీ ర్యాలీలు నిర్వహించారన్నారు. క్రీడా కోటాపై వైకాపా నేతలు అవగాహన రాహిత్యంతో అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
మంత్రి నారా లోకేష్ ప్రజాదరణను, ఎదుగుదలను చూసి ఓర్వలేకే జగన్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, ఇకనైనా నిరుద్యోగుల ఉసురు పోసుకోవడం మాని జగన్ తన తీరు మార్చుకోవాలని, లేకుంటే ప్రజలే వీధుల్లో నిలదీసి బుద్ధి చెబుతారని కంచర్ల శ్రీకాంత్ హెచ్చరించారు.
