డీఎస్సీపై గోబెల్స్ ప్రచారాన్నే నమ్ముకున్న ‘గొడ్డలి పార్టీ’

  • హిట్లర్, గోబెల్స్ తరహాలోనే జగన్ అసత్య ప్రచారాలు
  • అద్దె ఛానళ్లతో విద్యావంతుల జీవితాలతో చెలగాటం
  • గ్రూప్-1 కుంభకోణం తీర్పు భయంతోనే కొత్త నాటకాలు
  • టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ధ్వజం

కడప, ఆంధ్రప్రభ: మెగా డీఎస్సీపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైకాపా నేతలు హిట్లర్, గోబెల్స్ తరహాలో చౌకబారు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రతి నియామకానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు, పక్కా లెక్కలతో సమాధానం ఇచ్చినప్పటికీ వైకాపా నేతలు పదే పదే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గోబెల్స్ అసత్యాలను ప్రచారం చేసి జర్మనీని నాశనం చేసినట్లే, నేడు జగన్ తన సొంత మీడియా, అద్దె ఛానళ్లతో రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. కడప జిల్లాలో మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటా కింద అర్హత సాధించిన అభ్యర్థులపై, ఆత్మకూరు మండలానికి చెందిన వారిపై వైకాపా మీడియా నిరాధార ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారమే టెట్ ఉత్తీర్ణులైన క్రీడాకారులకు నియామకాలు జరిగాయని స్పష్టం చేశారు.

గ్రూప్-1 కేసు నుంచి దృష్టి మళ్లించే కుట్ర..

ఈ నెల 17వ తేదీన వైకాపా హయాంలో జరిగిన గ్రూప్-1 కుంభకోణంపై హైకోర్టులో కీలక తీర్పు రానుందని, దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జగన్ ఈ డీఎస్సీపై అపోహలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్సీ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి కనీస డిగ్రీ కూడా లేదని, అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఓటు నమోదు చేసుకోలేదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను బహిరంగంగా చూపించేందుకు సిద్ధంగా ఉన్నారని, దమ్ముంటే జగన్ కూడా తన ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్లను ప్రజల ముందు పెట్టాలని రాంగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు.