ఉద్యమకారుల అరెస్టులు అప్రజాస్వామికం!

లక్ష్మణ్‌ గౌడ్‌ మృతిపై నిరసన తెలిపితే అరెస్టులా?
ప్రభుత్వ తీరుపై ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల సాంబరావు ఆగ్రహం
నల్లబెల్లి, ఆంధ్రప్రభ:
తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించకుండా, తమ హక్కుల కోసం నిరసన తెలిపిన వారిని అర్ధరాత్రి అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల సాంబరావు విమర్శించారు.

మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బచ్చన్నపేట పీఏసీఎస్‌ డైరెక్టర్‌ లక్ష్మణ్‌ గౌడ్‌ ఆత్మహత్యపై నిరసన తెలిపిన వారిని ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమకారులు తమ జీవితాలను త్యాగం చేశారని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు పెన్షన్లు, సంక్షేమ పథకాలు కల్పించేందుకు కేశవరావు కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదన్నారు. లక్ష్మణ్‌ గౌడ్‌ మృతి ఉద్యమకారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. సహచరుడి మృతిపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ముందస్తుగా అరెస్టు చేసిన ఉద్యమకారులందరినీ బేషరతుగా విడుదల చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి పెన్షన్లు, ఇతర సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, జేఏసీ నల్లబెల్లి మండల చైర్మన్‌ వేముల రాజు, విద్యార్థి నాయకుడు మామిండ్ల చిన్న ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.