షార్ట్‌ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధం

మోపిదేవి, ఆంధ్రప్రభ: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధమైన ఘటన పెదకెళ్లపల్లి పంచాయతీ శివారు చిర్లపాలెం గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంజాల సుధాకర్‌రావు హోటల్‌ దుకాణం నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. అప్పటికే మంటలు ఇల్లంతా వ్యాపించడంతో పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది.

సమాచారం అందుకున్న అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం నష్టాన్ని అంచనా వేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.1.50 లక్షల విలువైన వస్తు సామగ్రి దగ్ధమైనట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.