టీజీఎస్ఆర్టీసీలో ‘దసరా’ బాదుడు..!
- ప్రత్యేక బస్సుల పేరిట ప్రయాణీకుల జేబులకు చిల్లులు
- హైదరాబాద్ – మంచిర్యాల రూట్ లో భారీ పెంపుదల
- ఒక్కో టిక్కెట్ కు 230 రూపాయలు పెంచేసిన అధికారులు
- ప్రయాణీకుల అవసరం, ఆసరా చేసుకుని అదనపు బాదుడు
- ఓ వందయితే పరవాలేదు మరీ రెండొందలా అంటున్న ప్రజలు
- పేరుకే ప్రత్యేకం.. అంతా ఆర్థికంగా దండుకోవడమేననే విమర్శలు
(మంచిర్యాల ప్రతినిధి – ఆంధ్రప్రభ)
టీజీఎస్ ఆర్టీసీలో దసరా బాదుడు మొదలైంది. పండుగ వాతావరణం షురూ అయ్యిందో లేదో.. ఆర్టీసీలో మాత్రం ఆర్థిక దోపిడీకి తెర తీశారు. ప్రత్యేకమనే పేరు పెట్టి ఆ బస్సుల్లో ప్రయాణించే వారి నుండి అదనపు చార్జీలు వసూలు చేస్తుండటమే దీనికంతటికి కారణం. సాధారణ చార్జీ కంటే రెండు వందలకు పైగా అదనంగా ముక్కుపిండి వసూలు చేస్తున్న ఘనత మాత్రం ఆర్టీసీ అధికారులకే దక్కుతోంది. ప్రయాణికులకు సేవలు అందిస్తున్నామన్న పేరుతో అందులో.. ప్రత్యేకమనే బోర్డు తగిలించి 2 వందల రూపాయలకు పైగా ప్రయాణికుల జేబులకు చెల్లెలు వేస్తున్నారని విమర్శలు ఈ సందర్భంగా లేకపోలేదు. నాలుగు రోజులుగా మొదలైన ఈ దండుకునే పర్వం పూర్తి వివరాల్లోకి వెళితే…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరా పండగ కోలాహలం మొదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోనే అతిపెద్ద తెలుగు ప్రజల అతిపెద్ద పండుగ ఈ దసరా. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపంగా జరుపుకునే బతుకు పండగ ఇది. అలాంటి పండగ సీజన్ ఆరంభం అవగానే ఆర్టీసీ ఆవురావురుమంటూ పైకి లేచింది. ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నామంటూ ఊదరగొట్టే ప్రచారానికి తెరతీసింది.
ప్రత్యేకమని చేపట్టిన బస్సులకు ఒక్కొక్కరి నుండి అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయమే ప్రయాణికుల పాలిట గుదిబండగా మారింది. హైదరాబాద్ – మంచిర్యాల మార్గంలో ఒక్కో ప్రయాణీకుడి నుండి 230 రూపాయల చొప్పున టిక్కెట్ చార్జీ వసూలు చేస్తుండడం గమనార్హం. మహిళలకు పూర్తిగా ఉచితం కాగా కొద్దోగొప్పో బస్సులు ఎక్కుతున్న పురుష ప్రయాణీకులకు 230 రూపాయలు అదనంగా వసూలు చేస్తుండడం విమర్శలకు దారితీస్తోంది.
శనివారం నుండే మొదలైన బాదుడు..!
దసరా పండగ.. ప్రయాణికులు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకున్న ఆర్టీసీ అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల జేబులకు ఎలాగైనా చిల్లులు వేయాలని ఉద్దేశంతోటే కాబోలు ప్రత్యేక బస్సులను చేపట్టారు. పాఠశాలలు, కళాశాలలకు 10వ తేదీ నుండి దసరా సెలవులు ప్రకటించారని అలా చెవిన పడిందో లేదో ఇక ‘ప్రత్యేక’ నినాదానికి తెర తీశారు.
ప్రయాణికుల రద్దీని ఆసరా చేసుకొని వారి అవసరాలు తీర్చుతున్నామనే కుంటి సాకులతో బస్సులను బూచిగా చూపెడుతున్న అధికారులు అదే సమయంలో ప్రయాణికుల జేబులకు చిల్లులు వేస్తున్నారనే సంగతి మాత్రం విస్మరించడం గమనించదగ్గ విషయం. గతంలో మంచిర్యాల నుండి హైదరాబాదు వెళ్లడానికి 500 రూపాయలు ఉన్న బస్సు టికెట్ చార్జికి ఇపుడు అదనంగా 230 రూపాయలు పెంచడం విశేషం. ఈ ధరలను కూడా సరిగ్గా పిల్లలకు సెలవు దినాలుగా ప్రకటించిన రోజు అంటే ఈనెల 10వ తేదీ శనివారం నుండి ఆర్టీసీ ఈ బాదుడు మొదలవడం గమనార్హం.
ఈ విషయమై మంచిర్యాల డిపో మేనేజర్ నరేష్ కుమార్ ను వివరణ కోసం ‘ఆంధ్రప్రభ’ సంప్రదించగా ఆయన ఫోన్ లో అందుబాటులోకి రాలేదు.
