టీజీలాసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : న్యాయ విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలోని ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీలాసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ బుధవారం (ఆగస్టు 19) నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే మొదటి విడతలో సీట్లు పొందలేని వారు, అలాగే కౌన్సెలింగ్‌లో పాల్గొనని అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన, నిర్ణయించిన ఫీజు చెల్లింపు ప్రక్రియలను ఆగస్టు 22 వరకు పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ విద్యార్హతలు, ఇతర అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

ఆగస్టు 23 నుంచి 25 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవచ్చు. ఇప్పటికే నమోదు చేసిన వెబ్‌ ఆప్షన్లలో మార్పులు చేసుకునేందుకు ఆగస్టు 26న అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు.

రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆగస్టు 29న పూర్తవుతుంది. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 5 మధ్యలో కేటాయించిన కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. లా కోర్సుల్లో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు గడువులోగా కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.