TG | అప్పు పుట్టడం లేదు.. బ్యాంకర్లు దొంగల్లా చూస్తున్నారు – రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : ఉద్యోగ సంఘాలు ఇక సమరమే అంటున్నాయి.. ఎవరి మీద మీ సమరం..? తెలంగాణ ప్రజలపైనా ఉద్యోగ సంఘాలు సమరం చేస్తాయా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

హైదరాబాద్‌లో జీ అవార్డులు 2025 ఫంక్షన్‌లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీ సమరం తెలంగాణ ప్రజలపైనా?.. ఎందుకు మీ సమరం… గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా? అంటూ ఆర్టీసీ కార్మికులను ఆయన సూటిగా ప్రశ్నించారు.

రాష్ట్రం ఆర్థికంగా ఏమాత్రం బాగాలేదని, తెలంగాణకు అప్పు పుట్టడం లేదని అన్నారు. రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు కోసం ప్రభుత్వ అధికారులు బ్యాంకర్లను కలవడానికి వెళితే దొంగలను చూసినట్లు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

మనవాళ్లు ఎవరైనా ఢిల్లీకి వెళితే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని, తెలంగాణ ప్రతినిధులను చెప్పులు కూడా ఎత్తుకు వెళతారేమో అన్నట్లుగా చూస్తున్నారని పేర్కొన్నారు.ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై సమరం అని ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతున్నారని, కానీ ఎవరిపై చేస్తున్నారని ప్రశ్నించారు.

ప్రభుత్వం అంటే తాము ఒక్కరమే కాదని, అందరూ కుటుంబ సభ్యులే అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ప్రజలే తమకూ ఉద్యోగాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాల నాయకులు తమ యుద్ధం ప్రజల మీద చేయాలనుకుంటున్నారా అని నిలదీశారు. రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారవద్దని హితవు పలికారు.

.”అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి తెచ్చి ఇచ్చేవాడిని. కానీ అప్పు పుట్టడం లేదు. ఎవరూ బజారులో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారం. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే మనల్ని బజారులో ఎవరైనా నమ్ముతారు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజారులో పడినట్లు మన పరిస్థితి అలాగే ఉంటుంది. ఉద్యోగ సంఘ నాయకులు దీనిని ఆలోచించాలి. ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం. పరువును బజారున పడేస్తామంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.

“ధరలు పెంచకుండా కొత్త కోరికలు నెరవేరవు

సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధరలు పెంచితేనే పథకాలు అమలు చేయడానికి వీలవుతుందని అన్నారు. ధరలు పెంచకుండా, ఇప్పుడు ఉన్న పథకాలు ఆపకుండా కొత్త కోరికలు నెరవేర్చడం కుదరదని ఉద్యోగ సంఘాల నాయకుల డిమాండును ఉద్దేశించి అన్నారు.తనను కోసినా ఈ రాష్ట్రానికి రూ. 18,500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం లేదని అన్నారు. ఖర్చులకు మాత్రం రూ. 22,500 కోట్లు అవసరమని చెప్పారు. ఇప్పుడు ఏ పథకం ఆపాలో చెప్పాలని ప్రశ్నించారు. విద్యుత్ సబ్సిడీని తీసేద్దామా లేక ఇంకేం చేద్దామని నిలదీశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధర్నాలు, దీక్షలు చేస్తే ఉన్న ప్రభుత్వ వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా మరింత దివాళా రాష్ట్రంగా మారిపోతామని అన్నారు.

తెలంగాణలో పోలీసులు నూటికి నూరు శాతం శాంతి భద్రతలు కాపాడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలబడి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించగలుగుతోందన్నారు. దేశ సరిహద్దుల్లోని సైనికుల్లా రాష్ట్రంలో శాంతి భద్రతలను పోలీసులు పరిరక్షిస్తున్నారని చెప్పారు. పోలీస్ ఉద్యోగం కత్తి మీద సాము లాంటిదని ఆయన అభివర్ణించారు. విధి నిర్వహణలో పోలీసులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారు కాబట్టే మనం ప్రశాంతంగా ఉండ గలుగుతున్నామన్నారు.

పోలీస్ శాఖకు ప్రశంసలు

ప్రజా ప్రభుత్వంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు భరోసా అందిస్తున్నామని స్పష్టం చేశారు.విధి నిర్వహణలో మరణించిన ఐపీఎస్ కుటుంబాలకు రూ.2 కోట్లు.. అడిషనల్ ఎస్పీ,ఎస్పీ కుటుంబాలకు రూ.కోటిన్నర నగదు అందిస్తున్నామని గుర్తు చేశారు. విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాలను ఆదుకునేందుకు ఈ ప్రజా ప్రభుత్వంలో అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన సోదాహరణగా వివరించారు.

పోలీస్ పిల్లల భవిష్యత్ కోసం 50 ఎకరాల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించుకున్నామని తెలిపారు. వారికి మంచి భవిష్యత్ అందించే బాధ్యత మాదని ఆయన స్పష్టం చేశారు.డ్రగ్స్ నియంత్రణకు యాంటీ నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు.

మారుతున్న కాలంతో పాటు నేరగాళ్లు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారని గుర్తు చేశారు. సైబర్ క్రైమ్ నియంత్రణకు ఆ విభాగాన్ని మరింత బలోపేతం చేశామన్నారు. నేరం జరిగినప్పుడే కాదు..నేరం జరగకుండా నియంత్రించాల్సిన బాధ్యత సైతం పోలీసులపై ఉందని చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *