తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ముఖ్యంగా రైతుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై జరుగుతున్న చర్చ ఇప్పుడు “ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాక్ అసెంబ్లీ” నిర్వహణ సవాల్ వరకు వెళ్ళింది.
బీఆర్ఎస్ నేతలు విసిరిన ‘చర్చకు సిద్ధమా?’ అనే సవాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చర్చకు తాము ఎప్పుడూ సిద్ధమేనని, కానీ అది క్లబ్బుల్లో, పబ్బుల్లో కాదు… చట్టసభల్లో జరగాలని సీఎం స్పష్టం చేశారు.
‘‘అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. లేదా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కే రండి, అక్కడే మాక్ అసెంబ్లీ పెట్టి చర్చిద్దాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు రావడానికి నేను కూడా సిద్ధమే’’ అంటూ ఆయన బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు.
రాష్ట్ర ప్రజల సమస్యలపై చట్టసభలే సరైన వేదికని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. చర్చకు తాము ఎప్పుడు సిద్ధమేనని, బీఆర్ఎస్ నాయకులు మాటలకే పరిమితం కాకుండా చట్టసభల్లో సమస్యలను చర్చించాలని ఆయన సూచించారు.
కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం (జులై 8) ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌కు వచ్చి, రైతుల సమస్యలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సవాల్ విసిరి, హాజరుకాకపోవడం ద్వారా “జవాబుదారీతనం నుండి తప్పించుకుంటున్నారు” అని, “తన సొంత సవాల్ నుండే వెనకడుగు వేస్తున్నారు” అని కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 600 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆరోపించారు. సీఎంకు సాగునీటి ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని, తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు మళ్లిస్తున్నారని కూడా ఆయన ధ్వజమెత్తారు.
ఈ క్రమంలో, బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా అంటూ చేసిన సవాళ్లపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. చర్చకు తాము సిద్ధమే అని స్పష్టం చేశారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహిద్దామని, తాను కూడా అక్కడికి రావడానికి సిద్ధమేనని ప్రకటించారు.