TG | సీఎం రేవంత్ తో ప్రొ.అభిజిత్ బెనర్జీ భేటీ !

ఆర్థిక శాస్త్ర నిపుణుడు, ఆర్ధశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత ప్రొ.అభిజిత్ బెనర్జీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం తీసుకున్న చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో, రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలను సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కూడిన తెలంగాణ రైజింగ్ అడ్వైజరీ కౌన్సిల్‌లో పాల్గొనమని ముఖ్యమంత్రి బెనర్జీని ఆహ్వానించారు. కాగా, సీఎం ఆహ్వానం మేరకు తెలంగాణ రైజింగ్ అడ్వైజరీ కౌన్సిల్‌లో సలహాదారుగా పాల్గొనడానికి బెనర్జీ అంగీకరించారు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను సృష్టించే అంశంపై చర్చిస్తూ, సాంప్రదాయ నైపుణ్యాలు, ఆధునిక డిజైన్, మార్కెటింగ్, సోషల్ మీడియా టెక్నాలజీ వినియోగంలో ప్రత్యేకత కలిగిన స్వల్పకాలిక కోర్సులను సృష్టించాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ బెనర్జీ అభిప్రాయపడ్డారు.

దీంతో సంప్రదాయ కళాకారులను ఆధునిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఫ్యూచర్ సిటీ లో భాగంగా క్రాఫ్ట్స్, ఆర్ట్స్, సృజనాత్మకత వంటి అంశాలను చేర్చాలని చెప్పారు.

ట్రాన్స్ జెండర్లను పోలీస్, మున్సిపల్ శాఖల్లో నియమించడం, అలాగే, ఔట‌ర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్ ఏరియాను సర్వీస్ సెక్టార్ గా అభివృద్ధి చేసే ప్ర‌ణాళికను ఎంచుకోవటం, స్కిల్ యూనివ‌ర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతకు అద్దం పడుతోందని ఈ సందర్భంగా అభిజిత్ బెన‌ర్జీ గారు అభినందించారు.

శ‌తాబ్దాల చరిత్ర ఉన్న హైద‌రాబాద్ విజ‌న్ ను, ఇక్క‌డ త‌యార‌య్యే ఉత్ప‌త్తులకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆదర‌ణ గురించి ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ విశిష్టతలను, ఇక్కడున్న అనుకూల వాతావరణాన్ని ప్రపంచ దేశాల్లో చాటిచెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాష్ట్రంలో మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాలు, రైతుల సాధికారత, యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు స్కిల్ డెవెలప్మెంట్ దిశగా ప్ర‌భుత్వం చేప‌డుతున్న విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌లను ప్రస్తావించారు.

సమావేశంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.రామకృష్ణ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్, ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply