కరీంనగర్ ఆంధ్రప్రభ మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి చోటు కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయింది. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించాలని మూడు రోజుల క్రితం మాదిగ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, జనరల్ సెక్రెటరీ కేసి. వేణుగోపాలకు వినతి పత్రాలు అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఢిల్లీ పెద్దలు మాదిగ వర్గానికి మంత్రి పదవి కట్టబెట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు శనివారం మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ నిర్వహించి మీలో ఒకరికి మంత్రి పదవి దక్కుతుందని అందరి మద్దతు ఉండాలని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇప్పటికే కాంగ్రెస్ లో సీనియర్ గా ఉన్న ధర్మపురి శాసనసభ్యులు అడ్లురి లక్ష్మణ్ కుమార్ కు విప్ పదవి ఉన్నందున మంత్రి పదవి మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ను వరించనున్నట్లు సమాచారం.
ఆదివారం హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని కవ్వంపల్లికి కాంగ్రెస్ అధిష్టానం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. 1998లో జనరల్ సర్జన్ గా కాకతీయ యూనివర్సిటీ నుండి కవ్వం పల్లి సత్యనారాయణ పట్టా పొందారు. గత కొన్ని పర్యాయాలుగా మానకొండూరు నుండి పోటీ చేసి ఓడిపోయినా పట్టు వదలని విక్రమార్కుడిలా 2023 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెల్పొందారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీకి సేవలందిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీలో కవ్వంపల్లి సత్యనారాయణ చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ అనుచర వర్గంగా ఉండడం సత్యనారాయణకు కలిసి వచ్చింది. అధికారికంగా శనివారం అర్ధరాత్రి కానీ ఆదివారం ఉదయం ప్రకటన రానుంది. ఆదివారం మధ్యాహ్నం తర్వాత రాజ్ భవన్ లో కవ్వంపల్లి సత్యనారాయణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కవ్వంపల్లి కి మంత్రి పదవి కట్టబెడితే కరీంనగర్ జిల్లాకు ప్రాతినిధ్యం దక్కనుంది.