TG | కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం ఆదేశాల‌ను స్వాగ‌తించిన కెటిఆర్

హైద‌రాబాద్ : కంచ గచ్చిబౌలి భూములపైన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగ‌తించారు. అలాగే కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అందరూ అభినందించాల‌న్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌కు వన్యప్రాణులను కాపాడాలంటూ ఆదేశాలు ఇవ్వడం గొప్ప విజయమ‌న్నారు. వన్యప్రాణుల పట్ల, పర్యావరణ పరిరక్షణకు పాటుపడే ప్రతి ఒక్కరికి దక్కిన విజయం ఇద‌న్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ పర్యావరణ పరిరక్షణకు గొప్ప ఊతం ఇస్తాయ‌ని కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు.

గొంతులేని మూగజీవాల కోసం, చెట్ల కోసం, పర్యావరణం కోసం అండగా నిలబడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు కెటిఆర్ . 400 ఎకరాల కంచ గచ్చిబౌలి అడవిని కాపాడి, హైదరాబాద్ భవిష్యత్తు కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పట్ల కృతజ్ఞతలు చెప్పారు.

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికారిక కమిటీ ఇచ్చిన సిఫార్సులను కూడా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నద‌న్నారు. కంచ గచ్చిబౌలిని ప్రైవేట్ పార్టీకి తాకట్టు పెట్టిన రేవంత్ ప్రభుత్వ వ్యవహారంలో.. ఆర్థిక అవకతవకలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన కేంద్ర సాధికారిక కమిటీ త‌మ‌ పార్టీ వాదనను బలపరుస్తున్నద‌ని పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలి భూముల తాకట్టు విషయంలో పదివేల కోట్ల రూపాయల అవినీతికి రేవంత్ రెడ్డి పాల్పడ్డారని చేసిన ఆరోపణలను కేటీఆర్ పునరుద్ఘాటించారు.

అడవుల పట్ల, వన్యప్రాణుల పట్ల రేవంత్ రెడ్డి నెంబర్ వన్ విలన్‌గా మారార‌ని కేటీఆర్ విమర్శించారు. పర్యావరణ విధ్వంసానికి, పర్యావరణ హత్యకు పాల్పడి తప్పించుకోలేరనే కనీస సోయి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇకనైనా వస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తనను తాను మోసం చేసుకున్న విషయాన్ని అర్థం చేసుకుని, పర్యావరణ విధ్వంసం ఆపాలని కేటీఆర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *