తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ తన పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉండాలని స్పష్టంగా సిఫార్సు చేసింది. పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను అదే ప్రాతిపదికన ప్రతిపాదించింది.
ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. హైకోర్టు విచారణ ఈ నెల 24న జరుగనున్న నేపథ్యంలో, రిజర్వేషన్ ప్రక్రియను అప్పటి వరకే పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌కు ఈసీ సిద్ధం..
డిసెంబర్ 20లోపు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. మొత్తం 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 16 వరకూ మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా ఈసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

