హైదరాబాద్ – కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ నేటి నుంచి క్షేత్రస్థాయిలో కార్యాచరణలోకి దిగుతున్నారు.
పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశాలకు శ్రీకారం చుడుతున్నారు. తొలుత గాంధీభవన్‌లో మెదక్, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ భేటీలో మీనాక్షి పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ బలోపేతానికి ఏ చర్యలు తీసుకోవాలో చర్చిస్తారు.
మంగళవారం మెదక్, మల్కాజిగిరి; బుధవారం కరీంనగర్, ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ నేతలందరితో ఆమె సమీక్షించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగే సమీక్షలకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర ముఖ్యనేతలందరూ రావాలని పీసీసీ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా నియమితులైన తరవాత మీనాక్షి నిర్వహించబోతున్న తొలి సమీక్ష సమావేశాలు కావడంతో నేతలంతా వీటికి ప్రాధాన్యమిస్తున్నారు.