తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో నిర్వహించిన కీలక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. వరంగల్‌లో జరిగిన సభతో.. కాంగ్రెస్ పార్టీ పతనానికి ప్రారంభమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందని, వారి హామీలను అమలు చేయకపోవడం ద్వారా వారి నిజస్వరూపం బహిర్గతమైందని విమర్శించారు.
తెలంగాణను పీడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వరుస పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ అరాచకాలను ఎదుర్కొనే శక్తి ఒక్క బీఆర్ఎస్‌కే ఉందని, రైతుల సమస్యల పరిష్కారం కోసం విస్తృత స్థాయిలో పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
“రైతుల ఆత్మహత్యలు, వారి సమస్యలపై కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ రైతాంగాన్ని రక్షించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. మోసానికి మారుపేరైన కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజలకు వివరించాల్సిన, ఆసన్నమైంది,” అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజలకు వివరిస్తుందని, వాటిని బహిర్గతం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల హక్కులను రక్షించేందుకు ఎప్పటికప్పుడు పోరాటాలను నిర్వహిస్తుందని కేటీఆర్ పునరుద్ఘాటించారు.