• కొత్త డిస్కమ్ ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలను సమర్థంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ రంగాన్ని పునఃవ్యవస్థీకరించేందుకు అవసరమైన సంస్కరణలను చేపట్టాలని, ఇందులో భాగంగా కొత్తగా ఒక ప్రత్యేక డిస్కమ్‌ (డిస్ట్రిబ్యూషన్ కంపెనీ)ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సంధర్భంగా జూబ్లీహిల్స్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కొత్తగా ఏర్పడే డిస్కమ్ పరిధిలో వ్యవసాయ విద్యుత్, ఉచిత గృహ విద్యుత్ (200 యూనిట్ల వరకు), ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఇతర శాశ్వత ఉచిత విద్యుత్ పథకాలను తీసుకురావాలని సూచించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఒకే యూనిట్‌గా ఉండాలని సీఎం స్పష్టం చేశారు.

ఈ డిస్కమ్ ఏర్పాటుతో ప్రస్తుతం ఉన్న డిస్కమ్‌ల పనితీరు మెరుగవుతుందని, జాతీయ రేటింగ్స్‌లో ముందుకు వస్తామని సీఎం తెలిపారు. ఆర్థిక భద్రత పెంచేందుకు సంస్కరణలు అనివార్యమని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థలపై ఉన్న భారీ రుణ భారాన్ని తగ్గించేందుకు తక్కువ వడ్డీ రుణాల ద్వారా రీస్ట్రక్చర్ చేయాలని సూచించారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల కలెక్టర్లు వీటి కోసం తగిన భవనాలను గుర్తించాలని సూచించారు. ముఖ్యంగా సచివాలయం కోసం R&B శాఖతో సమన్వయం చేసుకుని సోలార్ షెడ్లతో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లకు ఆదేశించారు.

గిరిజన ప్రాంతాల్లో ‘ఇందిర సోలార్ గిరి జల వికాసం’ పథకాన్ని విస్తరించాలని, వచ్చే మూడు సంవత్సరాల్లో 2.10 లక్షల మంది ఎస్టీ రైతులకు ప్రయోజనం చేకూర్చేలా 6 లక్షల ఎకరాల్లో సౌర పంపుసెట్లు అందించాలని సీఎం ఆదేశించారు.

Leave a Reply