TG | జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్ ఎత్తివేయండి – స్పీక‌ర్ కు బిఆర్ఎస్ విన‌తి

హైద‌రాబాద్ – తమ సభ్యుడు జగదీశ్ రెడ్డిపై విధించిన సస్పెన్ష్ ను ఎత్తివేయాల‌ని బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ ను కోరారు. అసెంబ్లీ సభ ప్రారంభమయ్యే మందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు , సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద, స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఆయన ఛాంబర్‌కు వెళ్లి కలిశారు. అనంతరం తమ సభ్యుడు జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌‌పై జగదీశ్ రెడ్డి ఏక వచనంతో ఎక్కడా మాట్లాడలేదని.. ఆయనపై సస్పెన్షన్ వేటు అక్రమం, అన్యాయమని సవివరంగా విన్నవించారు. సభా సంప్రదాయలను కూడా ఎక్కడా ఉల్లంఘించలేదని తెలిపారు. వెంటనే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్‌‌ను ఎత్తి వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా స్పీకర్‌ను విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీలోనూ…
తమ పార్టీ స‌భ్యుడు జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. మిమ్మల్ని అవమానించేలా జగదీశ్ రెడ్డి మాట్లాడలేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సభ ప్రారంభమైన తర్వాత మాట్లాడుతూ… స్పీకర్ ఎన్నిక సందర్భంగా మీకు బీఆర్ఎస్ పూర్తి మద్దతును ప్రకటించిందని హరీశ్ చెప్పారు. స్పీకర్ పట్ల గౌరవంగా వ్యవహరించాలని తమకు తమ పార్టీ అధినేత కేసీఆర్ చెపుతుంటారని తెలిపారు. తమ సభ్యులందరికీ మీపై ఎంతో గౌరవం ఉందని చెప్పారు. త‌మ స‌భ్యుడు జగదీశ్ రెడ్డి మీ గురించి ఏకవచనంతో మాట్లాడలేదని చెప్పారు. సభలో ఉంటే జగదీశ్ రెడ్డి మాట్లాడేవారని… కానీ సస్పెన్షన్ కారణంగా ఆయన సభకు రాలేకపోయారని అన్నారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించాలని కోరారు. సభలో జగదీశ్ రెడ్డికి మాట్లాడే అవకాశం కల్పించాలని విన్నవించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *