TG | పొట్టిశ్రీరాములు పేరు మార్చాల్సిన అవసరం ఏముంది : బండి సంజయ్

కరీంనగర్ ఆంధ్రప్రభ : పొట్టి శ్రీరాములు పేరిటనున్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఆ పేరును తొలగిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడంపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు.

అనంతరం మాట్లాడుతూ పొట్టిశ్రీరాములు గొప్ప దేశభక్తుడు, గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడని ఆర్యవైశ్యుల ఆరాధ్య నేత అని కొనియాడారు. అట్లాంటి గొప్ప నేత పేరును మార్చాల్సిన అవసరం ఏముందన్నారు. సురవరం ప్రతాపరెడ్డి అంటే మాకు గౌరవముందని, తెలుగు భాష ఉన్నతికి క్రుషి చేశారన్నారు. తెలుగు భాషాభివ్రుద్ధికి ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ఆయన పేరును పెట్టుకుంటే అభ్యంతరం లేదన్నారు.

కానీ పొట్టి శ్రీరాములు తొలగించి అవమానించడం కరెక్ట్ కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన కులాభిమానంతోనే పొట్టి శ్రీరాములు పేరును తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదించారన్నారు. సీఎం తీరు దేశభక్తులు, స్వాతంత్ర్య సమరయోధులతోపాటు ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. పొట్టి శ్రీరాములంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్ష ప్రాణాలర్పించిన అమరజీవి మాత్రమే కాదని,గొప్ప దేశభక్తుడన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడని, మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులను వదిలేసుకుని దేశం కోసం పోరాడిన వ్యక్తి అన్నారు. మహాత్మాగాంధీజీ ఇష్టమైన వ్యక్తి. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడన్నారు. సత్యాగ్రహా, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 3సార్లు జైలుశిక్ష అనుభవించాడని, హరిజనోద్యమం కోసం అనేక పోరాటాలు చేసిన నాయకుడన్నారు. మహనీయులను కాంగ్రెస్ పార్టీకి అవమానించడం అలవాటుగా మారిందన్నారు.

ఆనాడు అంబేద్కర్ ను కూడా అడుగడుగునా అవమానించిందన్నారు. ఎన్టీఆర్ పార్క్ కు ఆయన పేరును తొలగించే దమ్ముందా, కాసు బ్రహ్మనందరెడ్డి, నీలం సంజీవరెడ్డి పేరిట ఉన్న పార్కులకు వాళ్ల పేర్లను తొలగించే దమ్ముందా.. కోట్ల విజయభాస్కర్ పేరిట ఉన్న స్టేడియంకు ఆ పేరును తొలగించే దమ్ముందా అని అంతేందుకు ట్యాంక్ బండ్ పై అనేక మంది ఆంధ్రుల విగ్రహాలున్నాయని,వాటిని కూడా తొలగిస్తారా అని ప్రశ్నించారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుని పొట్టిశ్రీరామలు పేరును యధాతథంగా తెలుగు విశ్యవిద్యాలయానికి కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అట్లాగే ఆర్యవైశ్య సమాజానికి, దేశభక్తులందరికీ సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు నగనూరి రాజేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *