TG Assembly | మూసీ ప్ర‌క్షాళ‌న‌పై మాట‌ల యుద్ధం

TG Assembly | మూసీ ప్ర‌క్షాళ‌న‌పై మాట‌ల యుద్ధం

  • మూసీ కంపు కావాలా? వ‌ద్దా? : సీఎం
  • మూసీ కంపు కంటే సీఎం మాట‌లు కంపు ఎక్కువ : హ‌రీశ్‌రావు
  • మార్చిలో ఫ‌స్ట్ ఫేజ్ ప‌నులు
  • అసెంబ్లీలో వాడీవేడీ చ‌ర్చ‌

TG Assembly | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : అసెంబ్లీలో రెండో రోజు స‌మావేశంలో మూసీ ప్ర‌క్షాళ‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ శాస‌న‌స‌భ ఉప‌నేత హ‌రీశ్‌రావు మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. ఈ రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ మొదట 21 కి.మీ మేర మూసీ పునరుద్ధరణ పనులు చేప‌ట్ట‌నున్న‌ట్లు చెప్పారు. మూసీ నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని అన్నారు. అనంతగిరి హిల్స్ నుంచి వాడపల్లి వరకు మూసీ ప్రవాహం దాదాపు 240 కి.మీ ప్రవహిస్తుందని తెలిపారు. మూసీ, ఈసా నదులు కలిసే చోటు బాపూఘాట్ ఉందని.. అందుకే అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనకు రెండేళ్లు ఎన్నో సమీక్షలు జరిపామని అన్నారు. వరద ముప్పును తప్పించేందుకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఆనాడు నిజాం నవాబులు నిర్మించారని రేవంత్ పేర్కొన్నారు.

TG Assembly | మూసీ మురుగుతో నల్గొండకు శిక్ష..

మూసీ కంపుతో శిక్షను నల్గొండ (Nalgonda) ప్రజలు అనుభవిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు ఫ్లోరైడ్‌తో ఆ జిల్లా ప్రజలకు దేవుడు శిక్ష వేశాడని సభలో ప్రస్తావించారు. మూసీ నీళ్లు నల్గొండ జిల్లా ప్రజలకు గుడిబండలా మారాయని పేర్కొన్నారు. అక్కడి మూసీ పరివాహకంలో నీళ్లు తాగితే పిల్లలు పుట్టని పరిస్థితి ఉందని అక్క‌డ ప్ర‌జ‌లు ఆవేద‌న చెందుతున్నారు. చివరికి పంటలు పండించలేని దుస్థితి దాపురించిందని తెలిపారు.

TG Assembly

TG Assembly | 51 కిమీ మేర ఎలివేటెడ్ కారిడార్లు

మూసీ ప్రక్షాళనకు మొదట 21 కిమీ మేర పనులు ప్రారంభిస్తామని సభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మొదట అభివృద్ధి చేస్తామని అన్నారు. ఫస్ట్ ఫేజ్ పనులు మార్చిలో ప్రారంభం అవుతాయని.. సంక్రాంతిలోగా ఫస్ట్ ఫేజ్ డీపీఆర్‌ పై క్లారిటీ వస్తుందని పేర్కొన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 51 కి.మీ మూసీని అభివృద్ధి చేస్తామని అన్నారు. అదేవిధంగా ఆ 51 కిమీ మేర ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామని తెలిపారు. మీరాలం ట్యాంక్ (Tank) కూడా మూసీ అభివృద్ధిలో భాగమేనని అందుకు రూ.450 కోట్లతో బ్రిడ్జి కడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు.

TG Assembly

TG Assembly | అసలు మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు అవుతుంది? : హరీశ్‌రావు

మూసీ సుందీర‌క‌ర‌ణ‌కు ఎంత ఖర్చవుతుందో ప్రభుత్వం చెప్పాలని బీఆర్ఎస్ (BRS) శాస‌న‌స‌భ ప‌క్ష ఉప‌నేత‌ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఒకసారి సీఎం లక్ష కోట్లని, మరోసారి లక్షా 50 వేల కోట్లు అని పలుసార్లు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని, అసలు మూసీ సుందరీకరణ మీద ప్రభుత్వం ఎంత ఖర్చు చేయాలనుకుంటుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుకు తింటారా అని అంటున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఎంప్లాయిస్‌కి బెనిఫిట్స్ ఇవ్వమంటే డబ్బులు లేవు అంటున్నారు.. మరి మూసీ సుందరీకరణ మీద మాత్రం లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తారు..? అని ప్రశ్నించారు.

TG Assembly

TG Assembly | ఇప్పటివరకు ఎన్ని నివాసాలు కూల్చారు?.. ఇంకా ఎన్ని కూల్చాల్సి ఉంది?

మూసీ సుందరీకరణలో ఇప్పటివరకు ఎన్ని నివాసాలు కూల్చారు? కూల్చిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద ప‌రిహారం ఇచ్చారా? వేజ్ లాస్ చెల్లించారా? లేదా కేసీఆర్ (KCR) కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వారిని అసైన్మెంట్ చేసి చేతులు దులుపుకున్నారా? అని నిలదీశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ. 14 న్నర లక్షల డబ్బు ఇవ్వాల‌ని, వాళ్ల పాత ఇంటికి ఆర్ అండ్ బీ ఎస్టిమేట్ చేసి ఆ డబ్బులు చెల్లించాలన్నారు. అలాగే సేలబుల్ రైట్స్ తో కూడినటువంటి 200 గజాల స్థలం, ఇల్లు ఇవ్వాలన్నారు. ఇవి ఇచ్చారా? ఇవ్వలేదా? ఒకవేళ ఇస్తే ఎప్పటిలోగా ఇస్తారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం గుర్తించి కూల్చాల్సిన ప్రభుత్వ, ప్రైవేటు కట్టడాలు ఎన్ని? ఎంత భూమిని ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరిస్తున్నారు? అని ప్రశ్నించారు.

స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసీలో వదులుతామన్నారు. అసలు ఈ రెండున్నర టీఎంసీల గోదావరి జలాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు? అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుంచి ఆ గోదావరి నీళ్లను తెస్తున్నారా? లేక ఎక్కడి నుంచైనా గాలిలో నుంచి తెస్తున్నారా? ఆ రెండున్నర టీఎంసీలు ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాధానం చెప్పాలన్నారు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లను కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, గతంలో చెప్పినట్లుగా బుల్డోజర్లకు అడ్డంగా పడుకుని అయినా అడ్డుకుంటామని అన్నారు. ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి.. ఆ ఖాళీ స్థలాల్లో మూసీ సుందరీకరణ పనులు చేపట్టాలని, మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మూసీ సుందరీకరణ ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

TG Assembly

TG Assembly | మూసీ ప్రక్షాళన కావాలా.. వద్దా?

మూసీ ప్ర‌క్షాళ‌న కావాలా? వ‌ద్దా? అని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సభ్యలను ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ పార్టీ (Brs Party) ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండని కామెంట్ చేశారు. మూసీలో ఉండే కంపు కంటే.. కొంతమంది కడుపులో విషం ఎక్కువ ఉందని వ్యాఖ్య‌నించారు. తాము మూసీ ప్రక్షాళనపై వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే విషం కక్కుతున్నారని మండిప‌డ్డారు. అసలు మూసీ ప్రక్షాళన కావాలా.. వద్దా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

TG Assembly

TG Assembly | రేవంత్ మాటలు మూసీ కంటే కంపుగా ఉన్నాయి : హరీశ్‌రావు

సీఎం రేవంత్ రెడ్డి మాటలు మూసీ కంటే కంపుగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Mla Harish Rao) విమర్శించారు. సభలో ఉన్న సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయని ఆయన తెలిపారు. సభ్యుల హక్కులను కాపాడాల్సింది స్పీకరేనని స్పష్టం చేశారు. ఏడు రోజులు సభ నడుపుతామని బీఏసీలో చర్చించామని హరీశ్‌రావు తెలిపారు. కానీ బీఏసీ కాపీలో 7 రోజులు అని ఎక్కడా లేదని పేర్కొన్నారు. సభ ఎజెండా వివరాలు అర్ధరాత్రి 2 గంటలకు వస్తే.. సభ్యులు ఎలా ప్రిపేర్ అవుతారని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం వ్యాఖ్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. కానీ అందుకు స్పీకర్ నిరాకరించడంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.

TG Assembly

CLICK HERE TO READ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

CLICK HERE TO READ MORE

Leave a Reply