TG ASICON-2026 | ఆధునిక శస్త్ర చికిత్సలపై యువ వైద్యులకు అవగాహన

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆధునిక శస్త్ర చికిత్స విధానాలు, రోబోటిక్ వైద్య సాంకేతికత, అత్యవసర చికిత్సల్లో అనుసరించాల్సిన మెళకువలపై సీనియర్ వైద్యులు అందించిన సలహాలు జూనియర్ వైద్యులకు స్ఫూర్తినిచ్చాయి. శస్త్ర చికిత్స రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, పరిశోధనలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఆసికాన్-2026 సదస్సు వైద్య నిపుణుల చర్చలకు వేదికగా నిలిచింది. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఇంజినీర్స్ స్టాఫ్ కాలేజీలో శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన సుమారు 800 మంది వైద్యులు, శస్త్ర చికిత్స నిపుణులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో సదస్సు నిర్వహణ కమిటీ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ సురేష్ చంద్ర హరి, చైర్మన్ డాక్టర్ జగదీశ్వర్ గౌడ్, కార్యదర్శి డాక్టర్ ఎం.బీ. వికాస్కుమార్, కోశాధికారి డాక్టర్ కృష్ణకిరణ్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యాన్ని పవిత్రమైన వృత్తిగా, నైతిక విలువలతో కూడిన బాధ్యతగా, దైవకార్యంగా భావించాలని ఈ సందర్భంగా సూచించారు. రోగుల పట్ల నిబద్ధత, వైద్య సేవల్లో నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగించడం వంటి అంశాల ప్రాధాన్యాన్ని వివరించారు.

శస్త్ర చికిత్స రంగంలో ఆధునిక విధానాల అవసరం, సర్జన్ల కీలక పాత్ర, రోబోటిక్ వైద్యాన్ని సమర్థంగా వినియోగించే విధానాలపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ట్రామా కేసుల్లో అత్యవసర చికిత్స, రోబోటిక్ సర్జరీ, షాక్ థెరపీ, సురక్షితమైన కోలిసిస్టెక్టమీ (పిత్తాశయ శస్త్ర చికిత్స) ఆపరేషన్ల సమయంలో అధిక రక్తస్రావాన్ని నియంత్రించే పద్ధతులపై చర్చలు జరిగాయి. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా చైర్మన్ టీ. జీవన్రావు, కార్యదర్శి డాక్టర్ బీ. రమేష్, డాక్టర్ లింగం అశాల, సూర్య రామచంద్రవర్మ, డాక్టర్ సుదీర్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.