TG | నామినేష‌న్ల కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్…

TG | నామినేష‌న్ల కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్…

TG | నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని బుధవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, ఆదేశించారు. నామినేషన్ కౌంటర్లు, హెల్ప్‌డెస్క్, భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని నిర్మల్. బైంసా.ఖానాపూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ నామినేషన్లు స్వీకరించాలని అధికారులకు సూచించారు.

అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్, ఆస్తులు–బాధ్యతల వివరాలు, క్రిమినల్ కేసుల సమాచారం, అవసరమైన ఫీజు రశీదు తప్పనిసరిగా సమర్పించాలని తెలిపారు. అన్ని పత్రాలు సమగ్రంగా ఉన్నప్పుడే నామినేషన్‌ను స్వీకరించాలని స్పష్టం చేశారు. నామినేషన్ దాఖలులో అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించేలా అవగాహన కల్పించాలని, అవసరమైన సూచనలు ముందుగానే అందించాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్ర పరిసరాల్లో గుంపులు ఏర్పడకుండా చూడాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తేదీలను కూడా అభ్యర్థులకు స్పష్టంగా తెలియజేయాలని, ఎన్నికల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. ఆమెతో పాటు ఆర్డిఓ రత్న కళ్యాణి. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పాటు సంబంధిత ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply