14వ తేదీలోపే టెట్ ఫలితాలు !
- ఫైనల్ కీతో పాటు ఫలితాల విడుదలకు కసరత్తు పూర్తి
- సాంకేతిక పరిశీలన పూర్తయితే ఒకట్రెండు రోజుల్లోనే ప్రకటన
అమరావతి, (ఆంధ్రప్రభ) : ఏపీ టెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 14వ తేదీలోపే టెట్ తుది కీతో పాటు ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఫలితాల ప్రక్రియకు సంబంధించి విద్యాశాఖలో దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయని టెట్ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నామని.. అవన్నీ సవ్యంగా పూర్తయితే 14వ తేదీలోపే కీ, ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు.
దాదాపు పూర్తయిన పనులు
ఏపీ టెట్ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం, మార్కుల కేటాయింపు, డేటా ప్రాసెసింగ్ తదితర ప్రక్రియలు ఇప్పటికే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక కీని ఇప్పటికే విడుదల చేయగా.. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది కీని సిద్ధం చేసే ప్రక్రియ కూడా పూర్తయినట్లు సమాచారం.
ప్రస్తుతం ఫలితాల విడుదలకు ముందు చేపట్టాల్సిన సాంకేతిక పరిశీలనపైనే అధికారులు దృష్టి పెట్టారు. ఫలితాల డేటాలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా చూడటం, వెబ్‌సైట్‌లో ఫలితాలు సక్రమంగా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయడం వంటి తుది పనులు జరుగుతున్నాయి.
సాంకేతిక పరిశీలన సజావుగా పూర్తయితే సెప్టెంబర్ 14వ తేదీలోపే తుది కీ, టెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న డీఎడ్, బీఎడ్ అభ్యర్థులకు ఊరట లభించనుంది. ముఖ్యంగా ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో టెట్ మార్కులకు వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాలు అభ్యర్థులకు అత్యంత కీలకంగా మారాయి. టెట్ స్కోర్ ఆధారంగా తదుపరి డీఎస్సీ ప్రక్రియలో మెరుగైన అవకాశాలు పొందేందుకు అభ్యర్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?
టెట్ ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు అధికారిక టెట్ వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.
ముందుగా ఏపీ టెట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
హోమ్‌పేజీలో కనిపించే టెట్ ఆన్సర్ కీ/ఫలితాలు లింక్‌పై క్లిక్ చేయాలి.
తుది కీ కోసం సంబంధిత సబ్జెక్టును ఎంచుకోవాలి.
డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫైనల్ కీని పొందొచ్చు.
ఫలితాలు విడుదలైన తర్వాత హాల్‌టికెట్ నంబర్, అవసరమైన లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
స్క్రీన్‌పై టెట్ ఫలితాలు కనిపిస్తాయి.
ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవచ్చు.
