AP TET | టెట్ కత్తి.. పాత ఉపాధ్యాయుల మెడపైనేనా?
ఒకే ఉద్యోగం.. ఒకే తరగతి గది.. మరి అర్హత మార్కుల్లోనే ఎందుకు తేడా?
ఏళ్ల అనుభవానికి విలువ ఎంత? టెట్తోనే ఉపాధ్యాయుడి సామర్థ్యాన్ని కొలవడం సాధ్యమేనా?
2028 ఆగస్టు 31లోగా టెట్ తప్పనిసరి.. ఉపాధ్యాయ వర్గాల్లో కొనసాగుతున్న చర్చ
కనీస బోధనా సామర్థ్యానికి వేర్వేరు అర్హత గీతలు ఎందుకు?
AP TET | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: ఒకే ఉద్యోగం.. ఒకే హోదా.. ఒకే తరగతి గది.. ఒకే పిల్లలు.. ఒకే పాఠ్యప్రణాళిక.. ఒకే బోధనా బాధ్యత. మరి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో మాత్రం అర్హత మార్కులు ఎందుకు వేరు? ఈ ఒక్క ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకుండా టెట్ చుట్టూ ఎన్ని నిబంధనలు చెప్పినా అసలు సందేహం మాత్రం తీరదు. టెట్ ఉపాధ్యాయుడి కనీస వృత్తి సామర్థ్యాన్ని కొలిచే పరీక్ష అయితే.. ఆ కనీస ప్రమాణానికి వర్గాల వారీగా వేర్వేరు కొలమానాలు ఎందుకు? ఇదే ఇప్పుడు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్న ప్రశ్న.
రిజర్వేషన్ సామాజిక న్యాయానికి సంబంధించిన వ్యవస్థ. దానిని ప్రశ్నించడం ఈ చర్చ ఉద్దేశం కాదు. ఉద్యోగంలో అవకాశం కల్పించడం ఒక అంశం.. ఉద్యోగంలో చేరిన తర్వాత వృత్తిపరమైన సామర్థ్యాన్ని కొలవడం మరో అంశం. ఒకసారి ఉపాధ్యాయుడు తరగతి గదిలో నిలబడిన తర్వాత విద్యార్థికి అతని కులం తెలియదు. మార్కుల కేటగిరీ తెలియదు. ఉపాధ్యాయుడు చెప్పే పాఠం అర్థమవుతుందా లేదా అన్నదే ముఖ్యం. పిల్లల అవసరాలకు వర్గీకరణ ఉండదు. మరి కనీస బోధనా సామర్థ్యాన్ని కొలిచే ప్రమాణాల్లోనే ఎందుకు వ్యత్యాసం ఉండాలి అన్నదే ప్రశ్న.
90 మార్కులు అవసరమైతే.. 60 మార్కులు ఎలా?
టెట్‌లో వర్గాల వారీగా అర్హత మార్కులకు రాయితీలు ఉన్న నేపథ్యంలో అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఒక అభ్యర్థి సాధించిన మార్కులను కనీస అర్హతగా పరిగణిస్తే.. మరొక అభ్యర్థికి అంతకంటే ఎక్కువ మార్కులు అవసరమవుతున్నాయి. సామర్థ్యం ఒకటే అయితే అర్హత గీతలు ఎందుకు వేరు? 90 మార్కులు కనీస వృత్తి సామర్థ్యానికి అవసరమైతే.. 60 మార్కులతో అదే ప్రమాణం ఎలా నెరవేరుతుంది? 60 మార్కులు సరిపోతే 90 మార్కులు ఎందుకు? ఇది ఏ వర్గానికీ వ్యతిరేకమైన ప్రశ్న కాదు. ఇది టెట్ పరీక్ష రూపకల్పనను ప్రశ్నించే అంశం. వ్యక్తిని కాదు.. ప్రమాణాన్ని ప్రశ్నించాల్సిన సందర్భం. వృత్తిపరమైన సామర్థ్యానికి ఒకే ప్రమాణం అవసరమా? లేక సామాజిక వర్గాల ఆధారంగా వేర్వేరు అర్హత గీతలు ఉండటానికి విద్యాశాస్త్రపరమైన ఆధారం ఉందా? ప్రభుత్వం స్పష్టంగా చెప్పాల్సిన ప్రశ్న ఇదే.
కాగితంపై పరీక్షా.. తరగతి గదిలో అసలు పరీక్షా?
టెట్‌లో సిద్ధాంతపరమైన ప్రశ్నలకు సమాధానాలు రాయడం ఒక అంశం. నలభై మంది పిల్లలున్న తరగతి గదిలో అదే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడం మరో అంశం. పిల్లల స్థాయిని గుర్తించడం.. అర్థం కాని పాఠాన్ని మరో విధంగా చెప్పడం.. వెనుకబడిన విద్యార్థిని ముందుకు తీసుకురావడం.. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం.. తరగతిని సమర్థంగా నిర్వహించడం వంటి నైపుణ్యాలను ఒక పరీక్షా పత్రం ఎంతవరకు కొలవగలదు? టెట్ నిజంగా ఉపాధ్యాయుడి బోధనా సామర్థ్యాన్ని కొలవాలంటే పరీక్షా విధానం కూడా బోధనా వృత్తికి దగ్గరగా ఉండాలన్న వాదన వినిపిస్తోంది. కేవలం కాగితంపై పాస్ అయ్యే పరీక్షగా కాకుండా.. తరగతి గదిలో సమర్థవంతమైన ఉపాధ్యాయుడిని గుర్తించే విధంగా ఉండాలన్న అభిప్రాయాలు ఉన్నాయి.
సబ్జెక్టు ఉపాధ్యాయుడి అసలు పరీక్ష ఏది?
గణితం బోధించే ఉపాధ్యాయుడికి గణితంపై పట్టు ఉండాలి. సైన్స్ ఉపాధ్యాయుడికి శాస్త్రీయ అవగాహన అవసరం. సోషల్ స్టడీస్ బోధించే ఉపాధ్యాయుడికి చరిత్ర, భూగోళశాస్త్రం, పౌరశాస్త్రంపై స్పష్టత ఉండాలి. భాషా ఉపాధ్యాయుడికి భాషా నైపుణ్యంతో పాటు బోధనా పద్ధతులపై అవగాహన అవసరం. అయితే సబ్జెక్టు ఉపాధ్యాయుడిని అతను జీవితాంతం బోధించాల్సిన ప్రధాన సబ్జెక్టు కంటే ఇతర సాధారణ అంశాలపై ఎక్కువగా పరీక్షించడం ఎంతవరకు సమర్థనీయం? పరీక్షలో సబ్జెక్టు నైపుణ్యానికి ఎంత శాతం ప్రాధాన్యం ఉంది? సబ్జెక్టుపై పట్టు బలహీనంగా ఉన్న ఉపాధ్యాయుడు సాధారణ విభాగాల్లో మంచి మార్కులు సాధిస్తే సరిపోతుందా? మార్కులు వచ్చాయా అన్నదే ముఖ్యం? లేక పిల్లలకు బోధించాల్సిన విషయం పూర్తిగా వచ్చిందా అన్నదే ముఖ్యం? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అనుభవానికి విలువ ఎంత?
ఏళ్ల తరబడి తరగతి గదిలో పనిచేసిన ఉపాధ్యాయుడికి పుస్తక జ్ఞానంతో పాటు అనుభవ జ్ఞానం కూడా ఉంటుంది. విద్యార్థి ముఖాన్ని చూసి పాఠం అర్థమైందో లేదో గుర్తించడం.. ఒకే అంశాన్ని పిల్లల స్థాయికి అనుగుణంగా వివిధ రీతుల్లో వివరించడం.. వెనుకబడిన విద్యార్థిని గుర్తించి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం వంటి నైపుణ్యాలు సంవత్సరాల అనుభవంతో వస్తాయి. అనుభవం పరీక్షకు ప్రత్యామ్నాయం అని ఎవరూ చెప్పడం లేదు. కానీ ఒక పరీక్షా మార్కు మాత్రమే ఉపాధ్యాయుడి మొత్తం సామర్థ్యానికి పూర్తి చిరునామా ఎలా అవుతుంది? అన్నది మాత్రం చర్చించాల్సిన అంశం. పరీక్ష అవసరమైతే.. అనుభవం, శిక్షణ, తరగతి గది పనితీరు వంటి అంశాలను కూడా సమగ్రంగా పరిగణనలోకి తీసుకునే విధానం ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టెట్ పేరుతో పాత ఉపాధ్యాయుల మెడపై కొత్త కత్తి?
ఇదిలా ఉంటే పాత ఉపాధ్యాయులపై టెట్ తప్పనిసరి చేయడం మరో పెద్ద చర్చకు తెరతీసింది. ప్రభుత్వమే ఉద్యోగం ఇచ్చింది. ప్రభుత్వ నియామక నిబంధనల ప్రకారమే ఎంపిక జరిగింది. అదే ఉపాధ్యాయుడు పదేళ్లు.. పదిహేనేళ్లు.. ఇరవై ఏళ్లు విద్యార్థులకు బోధించాడు. ప్రభుత్వం అతని సేవలను స్వీకరించింది. వేతనాలు చెల్లించింది. పదోన్నతులు కల్పించింది. ఇప్పుడు అదే ప్రభుత్వం కొత్త అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని చెబుతోంది. ఇది టెట్ పరీక్షను వ్యతిరేకించే ప్రశ్న కాదు. ఒక వ్యవస్థ తన సొంత నియామక విధానాలపై వేసుకున్న ప్రశ్న. నిన్న అర్హుడిగా నియమించిన ఉపాధ్యాయుడిని.. నేడు కొత్త పరీక్షతో మళ్లీ అర్హుడా? అనర్హుడా? అని కొలవడం ఎంతవరకు సేవా న్యాయం? చట్టం మారవచ్చు. విద్యా ప్రమాణాలు మారవచ్చు. పిల్లల విద్యా హక్కులు మరింత బలపడవచ్చు. కానీ కొత్త ప్రమాణాలను గతంలో చట్టబద్ధంగా నియమితులైన ఉద్యోగులపై ఎలా అమలు చేయాలి? అనే విషయంలో ప్రభుత్వాల బాధ్యత ఏమిటి? అన్నది కీలక ప్రశ్న.
2009లో చట్టం.. 2010లో నిబంధనలు.. ఇప్పుడు పాత ఉపాధ్యాయులపై ప్రభావం…
పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్య హక్కును నిర్ధారించే RTE Act, 2009 ఆగస్టు 26, 2009న చట్టంగా వచ్చింది. 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. RTE Actలోని సెక్షన్ 23(1) ఆధారంగా NCTE 2010 ఆగస్టు 23న 1 నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయుల కనీస అర్హతలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో టెట్‌ను కనీస అర్హతల వ్యవస్థలో భాగంగా చేసింది. తర్వాత ఈ నిబంధనల అమలు, పాత ఉపాధ్యాయుల పరిస్థితి, ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ అవసరంపై న్యాయపరమైన వివాదం కొనసాగింది. సుప్రీంకోర్టు టెట్‌ను RTE చట్టంలోని సెక్షన్ 23 కింద నిర్దేశించిన కనీస అర్హతల్లో ఒకటిగా పరిగణిస్తూ సంబంధిత ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకూ టెట్ అవసరమని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యక్తిగత ఉపాధ్యాయులు సమీక్ష కోరినా.. సుప్రీంకోర్టు 2026 మే 29న సమీక్ష పిటిషన్లను కొట్టివేసింది. అయితే ప్రత్యేక ఉపశమనంగా ఆర్టికల్ 142 కింద టెట్ సాధించేందుకు గడువును 2028 ఆగస్టు 31 వరకు పొడిగించింది. టెట్‌ను సాధ్యమైనంత వరకు సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించాలని కూడా సూచించింది. మరింత గడువు పొడిగింపుకు అవకాశం ఉండదని కోర్టు స్పష్టం చేసింది. అంటే ప్రస్తుతం చట్టపరమైన స్థితి స్పష్టంగా ఉంది. టెట్ తప్పనిసరి.. గడువు 2028 ఆగస్టు 31.
అసలు నిందితుడు ఉపాధ్యాయుడా? వ్యవస్థా?
ఇక్కడే మరో కీలక ప్రశ్న ముందుకొస్తోంది. 2009లో RTE వచ్చింది. 2010లో NCTE నిబంధనలు వచ్చాయి. టెట్ వ్యవస్థ ఏర్పడింది. తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచాయి. అయినా పాత ఉపాధ్యాయుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఎందుకు రూపొందించలేదు? ఎవరికి టెట్ అవసరం? ఎవరికి మినహాయింపు? ఎవరికి ఎంత గడువు? ప్రమోషన్‌కు ఏ నిబంధన? సేవ కొనసాగింపుకు ఏ ప్రమాణం? వంటి అంశాలపై ముందుగానే స్పష్టత ఇచ్చి ఉంటే ఈ వివాదం ఇంత దూరం వచ్చేదా? అన్నదే ఉపాధ్యాయ వర్గాల ప్రశ్న. పాలక వ్యవస్థ విధానపరమైన ఆలస్యానికి ఉపాధ్యాయుడు మూల్యం ఎందుకు చెల్లించాలి? ప్రభుత్వమే నియమించి, సంవత్సరాల పాటు సేవలు తీసుకుని, ఆ తర్వాత కొత్త అర్హతను సాధించాల్సిందేనని చెప్పడం కేవలం అర్హత పరీక్ష అంశం మాత్రమే కాదు.. పాలనా జవాబుదారీతనానికి సంబంధించిన అంశం కూడా.
టెట్ నాణ్యత పరీక్ష కావాలి.. భయపెట్టే కర్ర కాదు
పిల్లలకు నాణ్యమైన విద్య కావాలి. అందుకు నాణ్యమైన ఉపాధ్యాయులు అవసరం. ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని నిరంతరం మెరుగుపరచాలి. శిక్షణ ఇవ్వాలి. మూల్యాంకనం చేయాలి. అవసరమైతే అర్హత పరీక్ష నిర్వహించాలి. కానీ పరీక్షను ఉపాధ్యాయులపై భయపెట్టే కర్రగా మార్చకూడదన్నదే ప్రధాన వాదన. పాత ఉపాధ్యాయులకు నాణ్యమైన శిక్షణ.. స్పష్టమైన సిలబస్.. తగినన్ని పరీక్షా అవకాశాలు.. పారదర్శక మూల్యాంకనం.. సమయానుకూలంగా పరీక్షల నిర్వహణ వంటి చర్యలు అవసరం. చట్టం అమలు చేయడం మాత్రమే కాకుండా దాని అమలుకు అవసరమైన వ్యవస్థను సకాలంలో సిద్ధం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే. అదే సమయంలో టెట్ అర్హత మార్కులకు శాస్త్రీయ ఆధారం ఏమిటి? వేర్వేరు వర్గాలకు వేర్వేరు అర్హత గీతలను నిర్ణయించడానికి విద్యాశాస్త్రపరమైన కారణం ఏమిటి? సబ్జెక్టు ఉపాధ్యాయుడి అసలు బోధనా నైపుణ్యాన్ని పరీక్ష ఎంత శాతం కొలుస్తోంది? సంవత్సరాల తరగతి గది అనుభవానికి ఎంత విలువ ఇస్తోంది? వంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు రావాలి.
ప్రమాణం పెట్టినవారే కారణం చెప్పాలి…
టెట్ ఉండకూడదని చెప్పడం సులభం. కానీ పిల్లల విద్యా నాణ్యతను కొలిచే ప్రమాణం అవసరమనే వాస్తవాన్ని కూడా విస్మరించలేం. అసలు చర్చ టెట్ ఉండాలా? వద్దా? అన్నది మాత్రమే కాదు. టెట్ ఏం కొలుస్తోంది? ఎలా కొలుస్తోంది? ఎవరికి ఎలా మార్కులు నిర్ణయిస్తోంది? పాత ఉపాధ్యాయుల విషయంలో దాని అమలు ఎలా ఉండాలి? అన్నదే అసలు ప్రశ్న. ఒక ఉపాధ్యాయుడి చేతిలో ఉన్నది కేవలం చాక్‌పీస్ కాదు.. ఒక పిల్లవాడి భవిష్యత్తు ఉంది. అందుకే ఉపాధ్యాయుడికి విషయ పరిజ్ఞానంతో పాటు బోధనా పద్ధతులు, బాలల మనస్తత్వం, భాషా సామర్థ్యం, తరగతి నిర్వహణ వంటి అంశాల్లో కనీస నైపుణ్యం అవసరం. పిల్లవాడికి బోధించే గణితం వర్గం చూసి మారదు. పాఠ్యపుస్తకం మారదు. తరగతి గది మారదు. బోధనా బాధ్యత మారదు. మరి కనీస వృత్తి సామర్థ్యాన్ని కొలిచే పరీక్షలో అర్హత గీత ఎందుకు మారాలి? అన్న ప్రశ్నకు ప్రభుత్వం ప్రజలకు అర్థమయ్యే భాషలో సమాధానం చెప్పాలి. టెట్ కత్తి అయితే.. అది విద్యా నాణ్యతను కాపాడే కత్తి కావాలి. ఉపాధ్యాయుల మెడపై వేలాడే కత్తి కాకూడదు. ఇదే ఇప్పుడు ఉపాధ్యాయ సమాజం ముందుంచుతున్న మౌలిక ప్రశ్న.
