కడపలో ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి అరెస్ట్
వైఎస్సార్ కడప, ఆంధ్రప్రభ: కడప వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో పాటు రవీంద్రనాథ్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి, పార్టీ కార్యాలయం నుంచి బలవంతంగా తరలించారు. అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ను అడ్డుకునేందుకు యత్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు ఈడ్చిపడేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. గతవారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా హింసాకాండ కొనసాగుతోందని, టీడీపీ శ్రేణులు అరాచకాలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని, నామినేషన్ పత్రాలను చించేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా.. పోలీసులు అధికార పార్టీ నేతలకు సహకరిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నారని, నామినేషన్లు వేయొద్దంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ పోలీసుల వైఖరిలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
