- 35 మంది ఆదివాసీలపై కేసు
మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో ఉద్రిక్తత నెలకొంది. కవ్వాల్ సెక్షన్‌లోని పాలగోరి ప్రాంతంలో కొంతమంది ఆదివాసీలు అక్రమంగా అడవిలోకి చొరబడి భూమిని ఆక్రమించి గుడిసెలు వేసుకున్నారని సమాచారం అందింది.
దీంతో ఎఫ్డీఓ రామ్మోహన్ ఆదేశాల మేరకు, ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గడిపల్లి శ్రీధరచారి ఆధ్వర్యంలో అటవీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే, వారి రాకను అడ్డుకునేందుకు కొంతమంది ఆదివాసీలు కారంపొడి చల్లి, కర్రలతో దాడి చేశారు.
ఈ ఘటనలో జన్నారం రేంజ్‌కు చెందిన దొంగపల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాజేందర్, బీట్ ఆఫీసర్ జె. సంతోష్ గాయపడ్డారు. రేంజ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు, కొమురం భీం-అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలం నేతునూరు గ్రామానికి చెందిన సీడం మోతిరాం నాయకత్వంలో 35 మంది ఈ దాడిలో పాల్పడినట్లు గుర్తించారు.
ఇంధన్ పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీధర్ చారి లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా, జన్నారం పోలీసులు సీడం మోతిరాం సహా 35 మందిపై 163/2025 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

