తీర ప్రాంతాల్లో ఉద్రిక్తత !
మొంథా తుపాన్ ప్రభావం, భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా తమిళనాడులో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. చెన్నై జిల్లా కలెక్టర్ రష్మి సిద్ధార్థ్ జాగడే అక్టోబర్ 28 (మంగళవారం)న చెన్నైలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అదే విధంగా, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఎం. ప్రతాప్ కూడా మంగళవారం నాడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
తుపాన్ ప్రస్తుతం (అక్టోబర్ 27, సోమవారం రాత్రి) చెన్నైకి తూర్పున సుమారు 440–600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) చెన్నై, పరిసర ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆంధ్ర, ఒడిశాలో అప్రమత్తతా చర్యలు
మొంథా తుపాన్ మంగళవారం రాత్రికి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని, ముఖ్యంగా కాకినాడ సమీప ప్రాంతాలను తాకే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్ర తీరప్రాంతాలు, విశాఖపట్నం పరిసర జిల్లాలు, అలాగే ఒడిశా దక్షిణ జిల్లాల్లో గంటకు 90–110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు “జీరో క్యాజువల్టీస్” లక్ష్యంతో ముందస్తు చర్యలు చేపట్టాయి. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిది దక్షిణ జిల్లాల్లో 5,000 మందికి పైగా విపత్తు నిర్వహణ దళాలను మోహరించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో 2014 నాటి హుద్‌హుద్ తుపాను విధ్వంసం గుర్తుకొస్తున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉన్నారు.
తుపాన్ ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో విద్యుత్, సచివాలయ ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. కాకినాడ, కోనసీమ, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో నాలుగు రోజులపాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించబడినాయి. అదనంగా, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

