బాలింత మృతితో అచ్చంపేటలో ఉద్రిక్తత!
బాలింత మృతితో అచ్చంపేటలో ఉద్రిక్తత!
- భవానీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ
- డిశ్చార్జి సమయంలో బీపీ పెరుగుదల.. ఇంజెక్షన్ తర్వాత విషమించిన పరిస్థితి
- మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళన.. అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో
- బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రెండు గంటలకు పైగా నిరసన
అచ్చంపేట, నవంబర్ 3 (ఆంధ్రప్రభ): పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఐదు రోజులకే ఓ బాలింత మృత్యువాత పడింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతుందనుకున్న సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు చివరకు ఆమె ప్రాణాలను బలిగొన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని భవానీ ఆస్పత్రి వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
బల్మూరు మండలం పోలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన పద్మ ఐదు రోజుల క్రితం భవానీ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో మంగళవారం డిశ్చార్జి చేసే సమయంలో ఆమెకు రక్తపోటు (బీపీ) పెరిగిందని, వైద్యులు ఇంజెక్షన్ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించి కోమాలోకి వెళ్లిందని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం కోసం వివిధ ఆస్పత్రులకు తరలించి, చివరకు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ పద్మ మృతి చెందింది.

బాలింత పద్మ (ఫైల్ ఫోటో)
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆగ్రహం
పద్మ మృతికి భవానీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతదేహంతో ఆస్పత్రి ఎదుట నిరసన కొనసాగిస్తుండగా పోలీసులకు, మృతురాలి బంధువులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో
ఆస్పత్రి ఎదుట ఆందోళన అనంతరం మృతురాలి బంధువులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు, గ్రామస్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో అచ్చంపేట పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ రెండు గంటలకుపైగా రాస్తారోకో నిర్వహించారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆందోళనకారులు స్పష్టం చేశారు.

ఈ నిరసనలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు బీశం ఆంజనేయులు, అచ్చంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి నారామోని నరేష్ యాదవ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ నాయకుడు సాయి మహారాజ్, సీపీఎం అచ్చంపేట మండల కార్యదర్శి వర్ధం సైదులు, మృతురాలి బంధువులు, గ్రామస్థులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
