అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత
- బీఆర్‌ఎస్ సభ్యులను బలవంతంగా లాక్కెళ్లిన మార్షల్స్..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతుండగా మార్షల్స్ అడ్డుకున్నారు. అనంతరం తాతా మధుతో పాటు అక్కడ ఉన్న బీఆర్‌ఎస్ సభ్యులను మీడియా పాయింట్ నుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు అధికారపక్షం ఆరోపించింది. ఈ వ్యవహారంపై తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే వారికి రిమాండ్ విధించేందుకు కోర్టు నిరాకరించింది. అనంతరం వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన నేపథ్యంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని శాసనసభ తీర్మానించింది. మంత్రి శ్రీధర్‌బాబు ఇద్దరు ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాలని మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటింగ్ అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలను ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం శాసనమండలి రేపటికి వాయిదా పడింది.
ఇదిలా ఉండగా, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్‌ఎస్ సభ్యులు మాట్లాడుతుండగా మార్షల్స్ వారిని అడ్డుకోవడంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. తాతా మధు మాట్లాడుతుండగానే మార్షల్స్ ఆయనను అడ్డుకుని, ఇతర బీఆర్‌ఎస్ సభ్యులతో కలిసి అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు.
