విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట
జీవో 97 రద్దు చేయాలని 20 రోజులుగా విద్యార్థుల ఆందోళన
కళాశాల నుంచి బయటకు వెళ్లే ప్రయత్నంలో స్వల్ప ఘర్షణ
డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని విద్యార్థుల డిమాండ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీవో నంబర్ 97ను రద్దు చేయాలని, పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి పరిధిలోకి తీసుకురావద్దని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన గురువారం మరింత తీవ్రరూపం దాల్చింది. గత 20 రోజులుగా తరగతులను బహిష్కరించి కళాశాల ప్రాంగణంలో నిరసన కొనసాగిస్తున్న విద్యార్థులు.. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు. ఆందోళన ఉద్ధృతం కావడంతో కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు
విద్యార్థులు కళాశాల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు కిందపడిపోయారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మీడియాను కూడా కళాశాల లోపలికి అనుమతించలేదని సమాచారం.
జీవో 97పై విద్యార్థుల అభ్యంతరాలు
జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి పరిధిలోకి తీసుకురావడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమ విద్యా విధానం, భవిష్యత్తుపై అనిశ్చితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శక్తి పరిధిలోకి వచ్చిన తర్వాత పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉందని విద్యార్థులు పేర్కొన్నారు. ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీలో ప్రతిపాదించిన పీపీపీ విధానం వల్ల పాలిటెక్నిక్ కళాశాలల భూముల వినియోగంపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
కరిక్యులమ్ మార్పులపైనా ఆందోళన
42ఏ నిబంధన ద్వారా పాలిటెక్నిక్ కరిక్యులమ్‌లో మార్పులు చేసే అవకాశం ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. సాంకేతిక విద్యా విధానంలోనే పాలిటెక్నిక్ కోర్సులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం జీవో 97పై స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం
జీవో 97ను రద్దు చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
