కోర్టులోనే కుప్పకూలిన టెన్నిస్‌ స్టార్‌..

ఆంధ్రప్రభ: టెన్నిస్‌ కోర్టులో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. జాంగ్‌జియాగాంగ్‌ చాలెంజర్‌ టోర్నీలో స్వీడన్‌ ఆటగాడు ఎలియాస్‌ యమర్‌ మ్యాచ్‌ మధ్యలోనే కుప్పకూలాడు. ప్రత్యర్థితో హోరాహోరీగా తలపడుతున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురైన యమర్‌.. కోర్టులో పడిపోవడంతో అధికారులు, ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు.

టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన యమర్‌.. హ్సు యు-హ్సియోతో తొలి రౌండ్‌ మ్యాచ్‌ ఆడుతున్నాడు. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన యమర్‌.. రెండో సెట్‌లో 5-3 ఆధిక్యంలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఒక కీలక గేమ్‌లో ప్రత్యర్థి షాట్‌ ఆడిన అనంతరం బేస్‌లైన్‌ వైపు వెళ్తున్న యమర్‌ ఒక్కసారిగా కిందపడిపోయాడు. వెంటనే అంపైర్‌, ప్రత్యర్థి ఆటగాడు అతడి వద్దకు చేరుకున్నారు. బాల్‌ బాయ్స్‌ టవల్స్‌తో అతడిని కప్పి ఉంచగా.. వైద్య సిబ్బందికి సమాచారం అందించారు.

కొద్దిసేపటి తర్వాత యమర్‌ లేచి బెంచ్‌ వద్దకు వెళ్లాడు. అయితే మళ్లీ కొద్దిసేపటికే కోర్టులో పడిపోవడంతో వైద్య సిబ్బంది మరోసారి అతడిని పరిశీలించారు. సుమారు తొమ్మిది నిమిషాల చికిత్స అనంతరం యమర్‌ తిరిగి ఆట కొనసాగించేందుకు ప్రయత్నించాడు. అయితే శారీరక ఇబ్బందులు కనిపించడంతో అతడు పూర్తి స్థాయిలో రాణించలేకపోయాడు. ప్రత్యర్థి హ్సు యు-హ్సియో మ్యాచ్‌లో ఆధిక్యం సాధించాడు. యమర్‌ అస్వస్థతకు గల కారణాలు, అతడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు వెల్లడికాలేదు. ప్రపంచ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో కొనసాగుతున్న యమర్‌కు ఎదురైన ఈ ఘటన టెన్నిస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.