Nepal |మానస సరోవర్ యాత్రకు వెళ్లి..!

మన్యం జిల్లాలో తీవ్ర ఆందోళన


Nepal | ఆంధ్రప్రభ, విజయనగరం : నేపాల్‌లో సంభవించిన వరదలు ఓ ఏపీ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. మన్యం జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ సంతోష్ కుమార్ సాహు కుటుంబం వరదల్లో గల్లంతైనట్లు సమాచారం అందడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

సంతోష్ కుమార్ సాహు గత 20 ఏళ్లుగా కుటుంబంతో కలిసి లండన్‌లో స్థిరపడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఆయన అనూహ్యంగా నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వరద ఉద్ధృతి కారణంగా వారి ప్రయాణం విషాదంగా మారింది.

సమాచారం ప్రకారం.. సంతోష్ కుమార్ సాహు (47), ఆయన భార్య సురభి (43), కుమార్తె స్పందన (18), మరో కుమార్తె సైనా (13) గల్లంతయ్యారు. వీరు వంతెనపై వాహనంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఉధృతంగా వచ్చిన వరద ప్రవాహం వాహనాన్ని ముంచెత్తినట్లు సమాచారం.

ఈ ఘటన గురించి నేపాల్‌కు చెందిన గైడ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే నలుగురి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత పెరిగింది. స్వదేశంలో ఉన్న బంధువులు వారి క్షేమ సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.

నేపాల్ వరదల్లో ఏపీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతైన వార్త మన్యం జిల్లాలో కలకలం రేపుతోంది. వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు వేగవంతం కావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.