TG | జీఎస్టీ వృద్ధి రేటులో వెనుకబడ్డ తెలంగాణ : హరీశ్ రావు

హైద‌రాబాద్ : 2025 మార్చి నెల తెలంగాణ జీఎస్టీ వృద్ధి 0శాతంకు పడిపోవడంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. దేశవ్యాప్తంగా సగటు జీఎస్టీ వృద్ధి రేటు 10శాతం ఉండగా, తెలంగాణ రాష్ట్రం దేశీయ వృద్ధి రేటుతో పోలిస్తే చాలా వెనకబడి ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. “జీఎస్టీ వృద్ధి 12.3శాతంగా ఉందని శాసనసభలో ప్రకటించడం శోచనీయం” అని హరీశ్ రావు అన్నారు. అయితే, అధికారిక గణాంకాలను పరిశీలిస్తే భట్టి విక్రమార్క వాదనలు పూర్తిగా అవాస్తవమైనవిగా తేలిపోయాయని ఎక్స్ లో స్పష్టం చేశారు.

‘బడ్జెట్ సమావేశాల్లో నేను ఈ విషయాన్ని ప్రస్తావించి, రాష్ట్ర జీఎస్టీ వృద్ధి రేటు 5.5శాతంకు పరిమితమవుతుందని హెచ్చరించాను. మా సలహాలు,హెచ్చరికలను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుతం అధికారికంగా తెలంగాణ వృద్ధి రేటు కేవలం 5.1శాతం మాత్రమేనని ధృవీకరించబడిందని చెప్పారు. తెలంగాణలో ఇంత తక్కువ జీఎస్టీ వృద్ధి ఇప్పటివరకు ఎన్నడూ నమోదు కాలేదు, కోవిడ్-19 లాక్‌డౌన్ కాలంలో తప్ప. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యానికి స్పష్టమైన నిదర్శనం’ అని ఆయన అన్నారు.

రాష్ట్ర వృద్ధి రేటు క్రమంగా తగ్గడానికి గత 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు కారణమని హరీశ్ రావు పేర్కొన్నారు. “క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు అమలులో లోపాలు, రైతు భరోసా ద్వారా పంట పెట్టుబడి సహాయం అందించకపోవడం, రైతు భరోసా పథకం కింద రూ.12,000 కోట్ల నిధులు విడుదల చేయకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు సామర్థ్యం తగ్గిపోయింది. అలాగే, హైడ్రా, మూసీ ప్రాజెక్టుల వంటి తప్పుడు విధానాలతో భయాందోళనలు సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడం, ఫార్మా సిటీ, మెట్రో రైలు ప్రాజెక్టులను రద్దు చేయడం వల్ల వ్యాపార వాతావరణం దెబ్బతింది” అని ఆయన వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *