Telangana | గజ గజ వణికిస్తున్న చలి..
Telangana, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. దీంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. గురువారం రాత్రి సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 5.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం 5 గంటల నుంచే చలి ప్రభావం మొదలైంది. ఉదయం 8 గంటలు దాటినా చలి ఎక్కువుగా ఉండడంతో జనజీవనం పై ప్రభావం చూపిస్తుంది. హైదరాబాద్‌లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. ఏడేళ్ల తర్వాత నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
శుక్రవారం ఉదయం శేరిలింగంపల్లి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతాల్లో 6.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యిందని వాతావరణ కేంద్రం తెలియచేసింది. మౌలాలిలో 7.1, రాజేంద్రనగర్‌లో 7.7, గచ్చిబౌలిలో 9.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం రాత్రి రాష్ట్రంలోని 28 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9.8 డిగ్రీల కంటే తక్కువగా నమోదు అయ్యింది. దీనిని బట్టి చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. 2014లో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైన 1.8 డిగ్రీల రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే మూడు, నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

