తెలంగాణలో స్పేస్ సిటీ.. అంతరిక్ష పరిశ్రమకు హైదరాబాద్ కొత్త కేంద్రం
- ఐటీ తర్వాత స్పేస్‌టెక్‌ను వృద్ధి ఇంజిన్‌గా మార్చే వ్యూహం
- ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక స్పేస్ సిటీ ఏర్పాటుకు అడుగులు
- హైదరాబాద్‌కు ఉన్న ఏరోస్పేస్ బలం ఇదే
- స్పేస్ హబ్‌గా ఎదగాలంటే ఎదురయ్యే సవాళ్లు
- మరో హైటెక్ సిటీగా మారనున్న హైదరాబాద్?
హైదరాబాద్,ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఐటీ.. ఆ తర్వాత ఫార్మా, లైఫ్‌సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంది. తెలంగాణ ఇప్పుడు మరో భారీ రంగంపై కన్నేసింది. ఆకాశాన్ని లక్ష్యంగా చేసుకుని స్పేస్‌టెక్ పరిశ్రమను రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కొత్త గ్రోత్ ఇంజిన్ గా మార్చే ప్రయత్నం మొదలు పెట్టింది. రాకెట్ల తయారీ నుంచి ఉపగ్రహాలు, స్పేస్ కమ్యూనికేషన్, నావిగేషన్, అడ్వాన్స్డ్ సెన్సింగ్, ఆర్బిటల్ టెక్నాలజీ వరకు మొత్తం అంతరిక్ష సాంకేతికతకు హైదరాబాద్‌ను కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 14 ప్రముఖ స్పేస్‌టెక్ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం ఈ దిశలో కీలక సంకేతంగా మారింది.
హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్-5 స్పేస్‌టెక్ హబ్‌లో ఒకటిగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా కార్యాచరణ ప్రారంభించింది. పరిశ్రమల నుంచి వచ్చిన ప్రధాన డిమాండ్ మాత్రం ఒక్కటే ప్రత్యేక స్పేస్ సిటీ ఏర్పాటని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అంతరిక్ష పరిశ్రమకు కేరాఫ్ స్పేస్ సిటీ
స్పేస్‌టెక్ కంపెనీలు విడివిడిగా పనిచేయడం కంటే ఒకే ప్రాంతంలో పరిశ్రమలు, స్టార్టప్లు, పరిశోధనా సంస్థలు, పరీక్షా కేంద్రాలు, తయారీ యూనిట్లు, అకడమిక్ సంస్థలు కలిసి పనిచేసే క్లస్టర్ మోడల్ అవసరమని పరిశ్రమ ప్రతినిధులు ప్రభుత్వానికి సూచించారు.
అందుకే భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక స్పేస్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనివల్ల ఒకే ప్రాంతంలో రాకెట్ తయారీ, ఉపగ్రహాల తయారీ, ఉపగ్రహ ఉపవ్యవస్థలు, గ్రౌండ్ స్టేషన్లు, సెన్సింగ్, నావిగేషన్ టెక్నాలజీ, స్పేస్ కమ్యూనికేషన్, ఆర్బిటల్ సిస్టమ్స్, స్పేస్ డెబ్రిస్ టెక్నాలజీ, పరీక్ష, ధ్రువీకరణ సదుపాయాలు, పరిశోధన, స్టార్టప్ ఇంక్యుబేషన్ వంటి కార్యకలాపాలకు ఒకే పర్యావరణ వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉంటుంది.
తెలంగాణకు స్పేస్‌టెక్ ఏర్పాటు విషయంలో బలమైన ఏరోస్పేస్, డిఫెన్స్, రీసెర్చ్, ఐటీ ఎకోసిస్టమ్ ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్‌లో స్కైరూట్, ఏరోస్పేస్, ధృవ స్పేస్ వంటి స్టార్టప్‌లు పనిచేస్తుండటంతోపాటు ఎన్ఆర్‌ఎస్‌ఏ, డీఆర్‌డీఓకి చెందిన అనేక సంస్థలు, పరిశోధనా కేంద్రాలున్నాయి. రాష్ట్ర స్పేస్‌టెక్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం హైదరాబాద్‌కు ఇప్పటికే ఉన్న ఏరోస్పేస్, డిఫెన్స్ మౌలిక వసతులు ఈ రంగం అభివృద్ధికి కీలక బలంగా మారనున్నాయి.
భారత్ ఫ్యూచర్ సిటీతో లింక్ ఎందుకు?
భారత్ ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం నెట్ జీరో, గ్రీన్‌ఫీల్డ్ నగరంగా, అధునాతన పరిశ్రమలు, ఏఐ, డేటా సెంటర్లు, గ్లోబల్ కంపెనీలు, పరిశోధనలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది.
ఇప్పటికే అక్కడ అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. అంటే ఫ్యూచర్ సిటీ కేవలం నివాస, వాణిజ్య నగరంగా కాకుండా అధునాతన సాంకేతిక పరిశ్రమల గమ్యస్థానంగా రూపుదిద్దుకునే ప్రయత్నం జరుగుతోంది.
ఆ నేపథ్యంలోనే స్పేస్ సిటీ ప్రతిపాదనకు ప్రాధాన్యం ఏర్పడుతోంది.
స్పేస్‌టెక్ అంటే కేవలం రాకెట్లు తయారు చేయడం కాదు. ఉపగ్రహాల నుంచి వచ్చే డేటా ఆధారంగా భూమిపై వేల కోట్ల రూపాయల విలువైన సేవలు అభివృద్ధి చేయవచ్చు.
అసలు పరీక్ష ఇక్కడే!
అయితే స్పేస్ సిటీ ఏర్పాటు ప్రకటనతోనే తెలంగాణ స్పేస్ హబ్‌గా మారే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పరిశ్రమ కోరుతున్న ప్రత్యేక పరీక్షా సదుపాయాలు, అత్యాధునిక మౌలిక వసతులు, దీర్ఘకాలిక స్పేస్‌టెక్ పాలసీ, పరిశోధన, పరిశ్రమ భాగస్వామ్యం, నైపుణ్యవంతులైన మానవ వనరులు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.
ముఖ్యంగా చిన్న స్టార్టప్‌లు భారీ పరీక్షా మౌలిక వసతులను సొంతంగా ఏర్పాటు చేసుకోలేవు. అందుకే కామన్ టెస్టింగ్ ఫెసిలిటీస్ కీలకం కానున్నాయి.
తెలంగాణకు ఇది మరో హైటెక్ సిటీ!
రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్ ఐటీ మ్యాప్‌పై పెద్దగా కనిపించలేదు. కానీ హైటెక్ సిటీ, ఐటీ కారిడార్లు, గ్లోబల్ కంపెనీల రాకతో నగరం దేశంలోని ప్రముఖ టెక్ కేంద్రాల్లో ఒకటిగా ఎదిగింది.
అదే కథను స్పేస్‌టెక్‌లో పునరావృతం చేయాలన్నది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఆలోచన అని సమాచారం.
రాష్ట్రానికి ఇప్పటికే ఉన్న రక్షణ పరిశోధన సంస్థలు, ఏరోస్పేస్ పరిశ్రమ, ఐటీ ప్రతిభ, స్టార్టప్ సంస్కృతి, ఫ్యూచర్ సిటీ వంటి కొత్త మౌలిక వేదికలు కలిస్తే హైదరాబాద్‌కు ఒక ప్రత్యేక అవకాశం ఉంది.
కానీ ఆ అవకాశాన్ని ప్రకటనల నగరం నుంచి ఉత్పత్తుల నగరంగా మార్చగలిగితేనే అనుకున్న లక్ష్యం నెరవేరనుంది.
రాకెట్లు హైదరాబాద్ నుంచి నింగిలోకి ఎగరడం కంటే.. వాటి వెనుక ఉన్న సాంకేతికత, తయారీ, పరిశోధన, ఉద్యోగాలు, పెట్టుబడులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలోకి దిగిరావడం ముఖ్యం.
ఆకాశాన్ని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ఇప్పుడు నేలపై పునాది ఎంత బలంగా వేస్తుందో చూడాలి.
