షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లలో తెలంగాణ పోలీసుల సత్తా

  • రాష్ట్ర, సౌత్‌జోన్‌ పోటీల్లో 15 పతకాలు..
  • 6 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్యాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ పోలీస్‌ షూటర్లు షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లలో సత్తా చాటారు. తెలంగాణ స్టేట్‌, సౌత్‌జోన్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌-2026లో మొత్తం 15 పతకాలను సాధించారు. ఇందులో ఆరు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ ఘనత సాధించిన పోలీస్‌ షూటర్లను తెలంగాణ పోలీస్‌ ఉన్నతాధికారి సీవీ ఆనంద్‌ అభినందించారు. షూటర్ల కృషి, క్రమశిక్షణ, ఏకాగ్రతను ప్రశంసించారు.

గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ-శాట్‌జీ షూటింగ్‌ రేంజ్‌లో జరిగిన 12వ తెలంగాణ స్టేట్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ పోలీస్‌ షూటర్లు 11 పతకాలు సాధించారు. ఇందులో నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. అనంతరం తిరువనంతపురంలో జరిగిన 17వ సౌత్‌జోన్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మరో నాలుగు పతకాలు సాధించారు. ఇందులో రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకం ఉన్నాయి.

ఈ స్థాయి పోటీల్లో విజయం సాధించడం నిరంతర సాధన, అంకితభావానికి నిదర్శనమని సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. షూటర్ల క్రమశిక్షణ, లక్ష్యంపై ఏకాగ్రతను అభినందిస్తూ.. రానున్న జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మరింత ఉన్నత స్థాయిలో రాణించి తెలంగాణ పోలీస్‌కు మరిన్ని పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కేవలం పాల్గొనడం కాకుండా విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని వారికి సూచించారు.