Telangana| మున్సి’ పోల్స్’.. అభ్యర్థుల ‘పల్స్’

Telangana| మున్సి’ పోల్స్’.. అభ్యర్థుల ‘పల్స్’
- ఆశవాహుల్లో ఉత్కంఠ
- అభ్యర్థుల ఖరారులో అధిష్టానం
- పార్టీ సింబల్.. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం
- నేడే నోటిఫికేషన్..
Telangana, మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సి పోల్స్ కాస్తా.. కౌన్సిలర్ అభ్యర్థుల పల్స్ ను హీటేక్కిస్తున్నాయి. అటు నోటిఫికేషన్ రాకపోవడం.. ఇటు ఆయా పార్టీలలో కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక కాకపోవడంతో.. ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. మోత్కూర్ మున్సిపాలిటీలో 12 వార్డులలో బరిలో దిగేందుకు అధికార కాంగ్రెస్ లో పోటీ అధికంగా ఉంది.
దీంతో ఆయా వార్డులలో నాకే టిక్కెట్ వస్తుందంటే.. నాకే వస్తుందంటూ ప్రచారం చేసుకోవడంతో పాటు ఎమ్మెల్యే సామెల్, ముఖ్య నాయకుల చుట్టూ ఆశావాహుల ప్రదక్షిణలు తప్పడం లేదు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలలో ఎమ్మెల్యే సామెల్, మాజీ ఎమ్మెల్యే కిశోర్ కుమార్ లు ఆయా వార్డులలో అభ్యర్థుల ఎంపిక కోసం వార్డు ఇంఛార్జి లతో పాటు ప్రత్యేకంగా సైలెంట్ సర్వే నిర్వహిస్తున్నారు.
పార్టీ గుర్తులతో (సింబల్) మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ ఎస్ లు ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొనున్నాయి. దాదాపుగా నేడు నోటిఫికేషన్ రానుండడంతో ఆశావాహుల్లో పార్టీ టిక్కెట్ పై ఉత్కంఠ నెలకొంది. నోటిఫికేషన్ వచ్చిన అనంతరం ఆయా పార్టీలు తమ కౌన్సిలర్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయా పార్టీలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో వైస్ చైర్మన్ పదవి కోసం బీసీ, జనరల్ స్థానాల్లో పోటీ చేసి ఆ పదవి పొందేందుకు అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఏది ఏమైనప్పటికీ మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపి తారాస్థాయిలో పోటీ పడనున్నారు.
