Telangana Heritage | పాలంపేట ‘గొల్లల గుడి’కి కేంద్రం అధికారిక గుర్తింపు.. ఆలయ విశిష్టత ఇదే!

ములుగు, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌: తెలంగాణ చారిత్రక వైభవానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. ములుగు జిల్లా పాలంపేటలోని ప్రాచీన ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది. భారత పురావస్తు అధ్యయన విభాగం (ఏఎస్‌ఐ) ఈ మేరకు ఆగస్టు 31, 2026న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని ఏఎస్‌ఐ జారీ చేసిన ప్రకటనను ‘గెజిట్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రత్యేక సంచికలో ప్రచురించారు. ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం–1958లోని సెక్షన్‌ 4(3) కింద ఈ గుర్తింపు ఇచ్చినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

రామప్పకు సమీపంలోనే మరో చారిత్రక అద్భుతం…

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కాకతీయ రుద్రేశ్వర ఆలయం (రామప్ప)కు నైరుతి దిశలో గొల్లల గుడి ఉంది. కాకతీయుల శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే ఈ ఆలయం నిర్మాణ శైలి, శిల్ప సంపదతో ప్రత్యేకతను సంతరించుకుంది. చూడగానే ఆకట్టుకునే నిర్మాణంతో పాటు.. ఆలయంలోని ప్రతి భాగంలోనూ ఆనాటి శిల్పుల ప్రతిభ కనిపిస్తుంది. గొల్లల గుడి తూర్పు ముఖంగా ఉన్న మండపంతో పాటు దాని చుట్టూ మూడు గర్భాలయాలతో కూడిన త్రికూటాలయ నిర్మాణాన్ని కలిగి ఉంది. ఆలయ ప్రహరీ, పైకప్పు అంచులు, ద్వారబంధాలపై చెక్కిన శిల్పాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ద్వారాల వద్ద కనిపించే హంసల వరుసలు, సున్నితమైన రంధ్రాల వల పనితనం ఆలయ నిర్మాణంలో కనిపించే ప్రత్యేక శిల్ప నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి.

ద్వారపాలకుల శిల్పాలు మరో ప్రత్యేక ఆకర్షణ…

ప్రధాన ఆలయానికి ముందుభాగంలో రెండు ఉప ఆలయాలు ఉన్నాయి. వీటి ద్వారాల వద్ద అందంగా చెక్కినద్వారపాలకుల విగ్రహాలు కనిపిస్తాయి. ఉప ఆలయాల ముందు ఉన్న అంతరాలయాల అంచులు కూడా శిల్పాలతో అలంకరించి ఉంటాయి. ప్రధాన మండపం నుంచి మధ్యలో ఉన్న మందిరానికి వెళ్లేలా ఆలయ నిర్మాణాన్ని రూపొందించారు. ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిశల్లో అంతరాలయాలతో కూడిన మూడు గర్భాలయాలు ఉండటం దీని ప్రత్యేకతను తెలియజేస్తుంది.

గోడలపై దేవతా మూర్తులు.. శిల్పాల్లో జీవం..

ఆలయ గోడలపై ఉన్న వివిధ గూళ్లలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, గణేశుడు, మహిషాసురమర్దిని వంటి దేవతా మూర్తుల శిల్పాలు దర్శనమిస్తాయి.అంతేకాదు.. జంతువుల ఆకృతులు, పుష్పాలంకరణలతో కూడిన ఎత్తైన వేదికపై ఆలయాన్ని నిర్మించారు. దీంతో ఆలయ నిర్మాణం మొత్తం శిల్పకళ, వాస్తు నైపుణ్యాల సమ్మేళనంగా కనిపిస్తుంది.

కాకతీయుల కళా వైభవానికి మరో నిదర్శనం..

రామప్ప ఆలయంతో ఇప్పటికే ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన పాలంపేట ప్రాంతానికి గొల్లల గుడికి లభించిన తాజా హోదా మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. శిల్పకళ, చారిత్రక నిర్మాణాలు, కాకతీయుల వారసత్వాన్ని అధ్యయనం చేసే వారికి ఈ కట్టడం మరింత కీలకంగా మారనుంది.శతాబ్దాల చరిత్రను తన శిల్పాల్లో దాచుకున్న గొల్లల గుడికి ఇప్పుడు జాతీయ ప్రాధాన్య కట్టడంగా అధికారిక గుర్తింపు రావడంతో.. పాలంపేట కాకతీయ వారసత్వంలో మరోసారి ప్రత్యేకంగా నిలిచింది.