Telangana Gunni Bags Scam | గన్నీ సంచుల పేరుతో సర్కారుకు శఠగోపం

  • సిండికేట్‌గా మారిన కొందరు కాంట్రాక్టర్లు
  • సర్కారుకు తప్పుడు సమాచారం.. ఇవ్వని సంచులు ఇచ్చినట్టుగా దొంగ లెక్కలు
  • కోట్లలో బిల్లుల స్వాహా..!
  • సీఎంకు చేరిన ఫిర్యాదులు ..
  • త్వరలో విచారణ దిశగా సర్కారు అడుగులు

Telangana Gunni Bags Scam | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పౌరసరఫరాలశాఖలో అవినీతి అధికారుల అండతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గన్నీ బ్యాగుల కృత్రిమ కొరతను సృష్టించి అక్రమార్కులు అందినకాడికి దోచుకుంటున్నారు. గన్నీ మర్చంట్స్‌ రాష్ట్ర నేతల పేరుతో కొందరు ప్రభుత్వానికి అత్యధిక ధరలకు గన్నీ బ్యాగులను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో గన్నీ మర్చంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన కరిపె వీరేశం తన అనుచరులతో కలిసి ఈ అక్రమ దందాకు పాల్పడినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతీ సంవత్సరం అడ్డగోలుగా టెండర్లను దక్కించుకుంటూ అధికారుల అండదండలతో ఈ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఇటీవలనే ముఖ్యమంత్రికి ఫిర్యాదు అందినట్టు తెలిసింది. త్వరలో దీనిపై విజిలె న్స్‌తోపాటు శాఖాపరమైన విచారణ జరపాలని ఈ ఫిర్యాదులో కొందరు పేర్కొన్నట్టు తెలిసింది. ప్రభుత్వానికి సరఫరా చేయకుండానే కొంతమంది తప్పుడు బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు శఠగోపం పెడుతున్నారని ఆధారాలతో సహా ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఇదే తరహా ఫిర్యాదులు గతంలో కూడా ప్రభుత్వానికి చేరడంతో లోతుగా దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిసింది.