గ్రాడ్యుయేట్ ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు..
- పట్టభద్రుల ఎన్నికలపై ఢిల్లీ వేదికగా సమీక్ష
- రెండు స్థానాలూ గెలవాల్సిందే..
- నేతలకు రేవంత్ దిశానిర్దేశం
ఆంధ్రప్రభ : తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలను ఎవరూ తేలికగా తీసుకోవద్దని, తమ పరిధిలో బాధ్యతగా వ్యవహరిస్తూ గెలుపు కోసం కృషి చేయాలని స్పష్టం చేశారు.
ఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. గంటకుపైగా కొనసాగిన భేటీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, విద్యుత్ కొరత తదితర అంశాలపై చర్చించారు..
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
రాష్ట్రంలో మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పదవీకాలం 2027 మార్చిలో ముగియనుంది. దీంతో ఈ రెండు స్థానాల్లో ఖాళీలు ఏర్పడనున్నాయి. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలు ఉన్నాయి.
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది.
ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదయ్యేలా చూడాలని, నమోదు ప్రక్రియ నుంచి పోలింగ్ వరకు ప్రతి దశను నిశితంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఎన్నికల వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు.
రెండు స్థానాల్లోనూ విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలు తమ పరిధిలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.
కరవు, విద్యుత్ కొరతపైనా చర్చ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, విద్యుత్ కొరతపై కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఆయా అంశాలపై నేతలతో సీఎం సమీక్షించారు. పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి రేవంత్ రెడ్డి పలు అంశాలపై నేతలకు సూచనలు చేశారు.
