Telangana Government Education Policy |రాజకీయాలకు అతీతంగా పెరుగుతున్న మద్దతు

  • ‘ప్రజా ప్రభుత్వం’ చర్యలపై రాజకీయాలకు అతీతంగా పెరుగుతున్న మద్దతు
  • విద్యార్థుల సర్టిఫికేట్లు ఆపుతున్న కాలేజీలపై చర్యలకు డిమాండ్‌
  • ఫీజు బకాయిల పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న కాలేజీలు
  • నిధుల దుర్వినియోగంపై స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ కోరుతున్న తల్లిదండ్రులు
  • ‘ఏ టు జెడ్‌’ గ్రీన్‌ ఛానెల్‌తో విద్యార్థులకు మేలు అంటున్న నిపుణులు
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అక్రమాలపై కఠిన చర్యలు అవసరం
  • అసెంబ్లీలో సీఎం నిర్ణయాలకు విపక్షాల నుంచి కూడా మద్దతు
  • అక్రమ కాలేజీలపై చర్యలు.. విద్యారంగ ప్రక్షాళనకు శ్రీకారం
  • అవసరం లేని కాలేజీలకు రీయింబర్స్‌ నిలిపివేయాలని సూచనలు
  • నూతన విద్యా విధానంపై సర్వత్రా ప్రశంసలు
  • పార్టీలకు అతీతంగా సీఎం నిర్ణయాలకు అభినందనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ పొలిటికల్‌ బ్యూరో : తెలంగాణాలో రేవంత్‌ సర్కారు అనుసరిస్తున్న నూతన విద్యా విధానంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారిన విద్యారంగం ప్రక్షాళనకు కఠిన చర్యలు అవశ్యమంటూ సమాజమంతా ముఖ్యమంత్రి ప్రసంగానికి మద్దతుగా నిలుస్తోంది. ‘రేవంత్‌ సార్‌.. మీ ఎడ్యుకేషన్‌ ప్లాన్‌ భేష్‌’ అంటూ సొంత పార్టీ శాసన సభ్యులతో పాటు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేల నుంచి అభినందనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అక్రమ కళాశాలల భరతం పట్టాల్సిందేనన్న విద్యారంగ నిపుణుల వాదనకు, విద్యార్థి సంఘాల డిమాండ్‌కు అనుగుణంగా తాజాగా అసెంబ్లి వేదికగా సర్కారు ప్రకటనతో మద్దతు లభిస్తుండడంతో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

అవసరం లేని కాలేజీలకు రీయింబర్స్‌ ఆపాల్సిందేనన్న రేవంత్‌ వాదన న్యాయమైనదిగా ఆర్థిక రంగ నిపుణలు, విశ్లేషకులు చెబుతున్నారు. నిధుల దుర్వినియోగం ఆపడం అవశ్యమంటూ సమాజాన్ని మెప్పించేలా ఉన్న నూతన విద్యా విధానం అమలు చేయాలన్న కోణంలో మేధావుల నుంచి సూచనలు, సలహాలు వస్తున్నాయి. పేదల సొమ్ము గద్దల పాలు కావొద్దన్న వాదన సామాన్య, మధ్యతరగతి వర్గాల నుంచి సైతం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ప్రజా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు. ఆ దిశగా నిర్ణయాలన్నీ సహేతుకమేన్న అభిప్రాయం బలపడుతోంది.

గతంలోనూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను దుర్వినియోగం చేసి సందర్భాలు, యాజమాన్యాలను గుర్తించి ఆ నిధులను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఓటు బ్యాంకు వ్యూహంతో కాకుండా సమాజం హితం కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భవిష్యత్‌ కార్యాచరణ అభినందనీయమంటూ పలువురు సీనియర్‌ ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల శాసన సభాపక్ష నాయకులు కొనియాడుతున్నారు. ‘ఏ టు జెడ్‌’ గ్రీన్‌ ఛానెల ద్వారా విద్యార్థులకు మేలు జరుగుతుందంటున్న నిపుణులు సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు, పాలిటెక్నిక్‌ విద్యలో తీసుకొచ్చిన మార్పులు, వాటిపై విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులు.. సర్టిఫికేట్ల సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలన్న విజ్ఞప్తులు ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి. 2008 నుంచి ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను దుర్వినియోగం చేసిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రెవెన్యూ రికవరీ యాక్టును ప్రయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా విద్యా కమిషన్‌ చేసిన సిఫారసులను అమలు చేయాలన్న అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతోంది. వందలాది కళాశాలలు ఏమాత్రం ఫీజు బకాయలు ఉన్నా విద్యార్థుల సర్టిఫికేట్లు ఇవ్వడం లేదన్న తల్లిడండ్రుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉన్నత చదువుల కొనసాగింపు నేపథ్యంలో ఎదురవుతున్న అవస్థలను గుర్తించి కళాశాలల దూకుడు చర్యలను నియంత్రించేందుకు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని, టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా సహాయం అందేలా చూడాలని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. అలాగే విద్యారంగానికి బడ్జెట్‌లో నిధులు పెంచాలని, పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాటు, మెస్‌ ఛార్జీలు, కాస్మొటిక్‌ ఛార్జీలు పెంపు, క్రమం తప్పకుండా బిల్లుల మంజూరుపై సీఎం రేవంత్‌ రెడ్డి భరోసా ఇవ్వడం హామీ పట్ల హర్షాతిరేకాలు వినిపిస్తున్నాయి. నిరుపేదల సంపద నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే నిధులను తిరిగి ఆయా వర్గాల సంక్షేమానికి ఖర్చు చేస్తామన్న సీఎం రేవంత్‌ రెడ్డి భరోసా, ధృడ సంకల్పం భేష్‌ అనిపించుకుంటోంది.

అసెంబ్లీ వేదికగా విద్యారంగానికి సంబంధించిన కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టమైన వివరణ ఇవ్వడం, రాష్ట్ర విద్యా విధానంపై సుదీర్ఘమైన సమాధానమిచ్చి ఆయా వర్గాల్లో నెలకొన్న అనుమానాలు, అపోహలను నివృతి చేయడం సమాజానికి మంచి చేయాలన్న భావనకు నిదర్శనమని అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో ప్రకటించుకుంటున్నారు. ”పాలిలిటెక్నిక్‌ విద్య ప్రైవేటీకరణ జరుగుతుందనే ప్రచారంపై స్పష్టత ఇవ్వడం, పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పడం, విద్యార్థులు ఎవరి చేతుల్లోనో పావులుగా, కీలుబొమ్మలుగా మారొద్దని ప్రభుత్వంగా విజ్ఞప్తి చేయడం, ముందు యుగం దూతలుగా మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునివ్వడం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తున్నామని స్పష్టం చేయడం, నిజాయితీగా వివరాలందించిన కాలేజీల రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడతల వారిగా చెల్లిస్తామని భరోసా కల్పించడం” లాంటి అనేక అంశాలు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ నిబద్ధతకు, ముందుచూపుకు నిదర్శనంగా నిలిచాయి.

శాసనసభలో రాష్ట్ర విద్యా రంగం, ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిపై రేవంత్‌ రెడ్డి మూడున్నర గంటల పాటు చేసిన కీలక ప్రసంగంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌, పాలిటెక్నిక్‌, డిగ్రీ, రెసిడెన్షియల్‌ కళాశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయుల పూర్తి గణాంకాలను సభకు వివరించడంతో విద్‌యర్థులు, యువకుల నుంచి మద్దతు పెరగుతోంది. రైట్‌ టు ఎడ్యుకేషన్‌ నిబంధనల కంటే మెరుగ్గా రాష్ట్రంలో ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉన్నారన్న అంశపై ఉపాధ్యాయ సంఘాలు కీర్తిస్తున్నాయి. 55 రోజుల్లోనే 10వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామన్న ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలను చిగురింపజేస్తోంది.

విద్యారంగంలో ప్రక్షాళనకు ముందు ప్రభుత్వం చేయాలనుకుంటుందిలా…

ఇంటర్మీడియట్‌ విద్యలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న బట్టీ- పద్ధతికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో కేవలం పాఠ్యాంశాలను గుర్తుపెట్టుకునే గుడ్డి విధానాన్ని మాని, విశ్లేషణాత్మక, సృజనాత్మక ఆలోచనా శక్తిని పెంపొందించేలా ప్రశ్నపత్రాల సరళిని పూర్తిగా మార్చనున్నారు. కేంద్ర ప్రభుత్వ ‘పరాఖ్‌’ మార్గదర్శకాలు, జాతీయ విద్యా విధానం ప్రకారం 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాల్లో ప్రతి పాఠం చివర ప్రశ్నలు ఇస్తున్నారు. వీటిలో నుంచే పబ్లిక్‌ పరీక్షల్లోనూ ప్రశ్నలు అడుగుతున్నారు. దీంతో విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను బట్టీ పట్టి పరీక్షల్లో రాసే పరిస్థితి ఉందని అధికారులు గుర్తించారు.

దీనికి చెక్‌ పెట్టేలా ఇకపై ప్రశ్నపత్రాల్లో 10 శాతం ప్రశ్నలను పూర్తిగా కొత్త తరహాలో రూపొందించనున్నారు. విద్యార్థి తాము నేర్చుకున్న అంశాన్ని కొత్త పరిస్థితుల్లో ఎలా అన్వయించగలడు, ఎంతవరకు అర్థం చేసుకున్నాడు అనే కోణంలో ఈ ప్రశ్నలు ఉంటాయి. ఇందుకోసం ప్రత్యేకంగా క్వశ్చన్‌ బ్యాంక్‌ను తయారు చేసేందుకు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌ షాప్స్‌ నిర్వహిస్తోంది. అధ్యాపకుల నుంచి సృజనాత్మక ప్రశ్నలను సేకరించి, వచ్చే విద్యా సంవత్సరం ముద్రించే కొత్త పాఠ్యపుస్తకాల చివర వాటిని చేర్చనున్నారు. ఈ మార్పుల ద్వారా విద్యార్థుల్లో సమస్యలను పరిష్కరించే సామర్థం, ఆలోచనా నైపుణ్యాలు గణనీయంగా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలోనే విద్యార్థులు ఈ కొత్త విధానానికి అలవాటుపడేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు.