Telangana Future City | ‘ఫోర్త్‌ సిటీ’పై ఫ్యూచర్‌ ప్లాన్‌.. పెట్టుబడులే కీలకం!

  • ముందుకు సాగని భారత్‌ ఫ్యూచర్‌ సిటీ.. మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం
  • రూ.30 వేల కోట్ల ఏడీబీ రుణంతో ఐదేళ్ల కార్యాచరణకు కసరత్తు..
  • ట్రిపుల్‌ఆర్‌ పనులే కీలకం.. ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0’పై కొత్త ఆశలు

Telangana Future City | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ పొలిటికల్‌ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’ అభివృద్ధి ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ రంగాల్లో భారీ పెట్టుబడులు ఆకర్షించి కొత్త నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి మౌలిక సదుపాయాల కొరత ప్రధాన అడ్డంకిగా మారుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తూ కొత్త కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబరులో ఫ్యూచర్‌ సిటీ వేదికగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0’పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

పెట్టుబడులే అసలు సవాల్‌!

ఫ్యూచర్‌ సిటీని పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ రంగాలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలంటే బహుళజాతి సంస్థల పెట్టుబడులు కీలకం. ఇందుకోసం మెరుగైన రహదారులు, రవాణా వ్యవస్థ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. అయితే, ఈ పనుల్లో జాప్యం చోటుచేసుకోవడంతో పెట్టుబడుల ఆకర్షణపై ప్రభావం పడుతోంది. సుమారు 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని భావిస్తున్న ఫోర్త్‌ సిటీ పురోగతిపై ఈ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.

పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలు, రాయితీలపై స్పష్టత ఇవ్వడం ద్వారా సంస్థలను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపే ప్రక్రియను మళ్లీ వేగవంతం చేసినట్లు సమాచారం.

రూ.30 వేల కోట్ల రుణంతో కొత్త కార్యాచరణ

ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అందులో భాగంగా ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి రూ.30 వేల కోట్ల రుణం పొందే అంశం తెరపైకి వచ్చింది. అయితే, నిధులు సమకూరడమే కాకుండా వాటిని మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక అభివృద్ధి, రవాణా వ్యవస్థల నిర్మాణానికి సమర్థంగా వినియోగించడం కూడా కీలకం.

ఆశించిన స్థాయిలో పెట్టుబడులు వస్తే పారిశ్రామిక, వాణిజ్య, స్థిరాస్తి రంగాల్లో భారీగా ఆర్థిక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు రూ.3 లక్షల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనాలు చేకూరవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ లక్ష్యాలు కార్యరూపం దాల్చాలంటే ఒప్పందాలను వాస్తవ పెట్టుబడులుగా మార్చడం, మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయడం అవసరం.

పాత ఒప్పందాలపై మళ్లీ సమీక్ష
గత ఏడాది జరిగిన గ్లోబల్‌ సమ్మిట్‌, దావోస్‌ పర్యటనలతో పాటు అమెరికా, జపాన్‌, సింగపూర్‌, దుబాయ్‌ పర్యటనల్లో వివిధ సంస్థలతో కుదిరిన పెట్టుబడి ఒప్పందాలను ప్రభుత్వం మరోసారి సమీక్షిస్తోంది. వాటిలో ఏవి కార్యరూపం దాల్చే అవకాశముంది? ఏయే సంస్థలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు అవసరం? ఏ అంశాల్లో ప్రభుత్వ జోక్యం కీలకం? అనే విషయాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.
గతంలో కుదిరిన అవగాహన ఒప్పందాల్లో (ఎంవోయూల్లో) గడువు పరిమితులు ఉన్నందున, వాటిని పునఃసమీక్షించి అవసరమైతే గడువును పొడిగించే అంశంపైనా చర్చలు జరుగుతున్నాయి. ఆర్థిక, పరిశ్రమలు, పురపాలక, రెవెన్యూ, ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కంపెనీలతో సంప్రదింపులు జరిపే బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడుల ఒప్పందాల్లో గణనీయమైన భాగాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయగలిగితేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి. అందుకే ఒప్పందాల సంఖ్య కంటే వాస్తవ పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

ట్రిపుల్‌ఆర్‌ జాప్యమే ప్రధాన అడ్డంకి!

హైదరాబాద్‌ చుట్టూ ప్రతిపాదించిన ప్రాంతీయ రింగ్‌ రోడ్డు (ట్రిపుల్‌ఆర్‌) ప్రాజెక్టు ఫ్యూచర్‌ సిటీతో పాటు నగరం పరిసర ప్రాంతాల అభివృద్ధికి కీలకంగా మారనుంది. ఈ రహదారి అందుబాటులోకి వస్తే పారిశ్రామిక ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు సరకు రవాణా, పెట్టుబడుల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

అయితే, అనుమతులు, టెండర్లు, నిధుల సమీకరణ వంటి అంశాల్లో జాప్యం ప్రాజెక్టు పురోగతిని ప్రభావితం చేస్తున్నాయి. గత ఏడాది డిసెంబరులో ప్రారంభమైన టెండర్ల ప్రక్రియ కూడా ఆశించిన వేగంతో ముందుకు సాగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతులు, ఆర్థికపరమైన అంశాలు ఈ ఆలస్యానికి కారణాలుగా పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో ట్రిపుల్‌ఆర్‌ ఉత్తర భాగం పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగం పనులనూ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. కేంద్రం నుంచి అనుమతులు లభించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే పనులను ముందుకు తీసుకెళ్లే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఆరు వరుసల రహదారిపై ప్రతిపాదన

ట్రిపుల్‌ఆర్‌ ఉత్తర భాగాన్ని తొలుత నాలుగు వరుసల రహదారిగా నిర్మించాలని భావించినప్పటికీ, ఆరు వరుసలుగా విస్తరించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనికి కేంద్ర మంత్రివర్గం నుంచి ఇంకా ఆమోదం లభించాల్సి ఉంది. రహదారిని ఆరు వరుసలకు విస్తరించాలని నిర్ణయిస్తే టెండర్ల ప్రక్రియలో మార్పులు చేయాల్సి రావచ్చు. దీంతో ప్రాజెక్టు వ్యయం, నిర్మాణ కాలపరిమితిపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ట్రాఫిక్‌ సర్వే, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)పై మరోసారి అధ్యయనం చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఉత్తర భాగం పనులకు సుమారు రూ.6,500 కోట్ల నిధులు అవసరమవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భూసేకరణ నుంచి నిర్మాణం వరకు వివిధ దశల్లో నిధుల సమీకరణ, అనుమతుల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.

గ్లోబల్‌ సమ్మిట్‌పై ఆశలు

ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి ఊతమిచ్చేలా డిసెంబరులో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0’ను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. అంతర్జాతీయ పారిశ్రామిక, వాణిజ్య సంస్థలను ఆకర్షించడం, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించడం, గత ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.

అయితే, సదస్సులో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా, గతంలో ప్రకటించిన పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావడం కూడా ప్రభుత్వానికి ముఖ్యమైన పరీక్షగా మారనుంది. పరిశ్రమలకు అవసరమైన రవాణా, విద్యుత్‌, నీరు, ఇతర మౌలిక సదుపాయాలు సమయానికి అందుబాటులోకి వస్తేనే పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుంది.

కార్యాచరణకు వేగం వస్తేనే లక్ష్యం సాధ్యం

ఫ్యూచర్‌ సిటీని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం భారీ పెట్టుబడులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, వేగవంతమైన అనుమతుల ప్రక్రియపై ఆధారపడి ఉంది. ట్రిపుల్‌ఆర్‌ పనుల్లో పురోగతి, పెట్టుబడి ఒప్పందాల అమలు, ఏడీబీ రుణం ద్వారా నిధుల సమీకరణ వంటి అంశాలు కీలకం కానున్నాయి.

ప్రస్తుతం ప్రభుత్వం కొత్త కార్యాచరణపై దృష్టి సారించినప్పటికీ, ప్రణాళికలు క్షేత్రస్థాయిలో అమలైతేనే ఫోర్త్‌ సిటీ భవిష్యత్తుపై స్పష్టత వస్తుంది. ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0’ ఈ దిశగా ఎంతవరకు పురోగతి సాధిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.