Telangana Form 7 False Applications |ఫారం-7 దుర్వినియోగంపై ఎన్నికల శాఖ నజర్
- అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించేందుకు తప్పుడు దరఖాస్తులు చేస్తే కఠిన చర్యలు
- విచారణ తర్వాత బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఎన్నికల అధికారి ఆదేశం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ కొనసాగుతున్న వేళ.. ప్రీ-ప్రింటెడ్ ఫారం-7ల వ్యవహారం కలకలం రేపుతోంది. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు కొందరు తప్పుడు దరఖాస్తులు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సీ. సుదర్శన్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
తప్పుడు దరఖాస్తులు చేస్తే చర్యలు
అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు కావాలనే తప్పుడు వివరాలతో ఫారం-7 సమర్పించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి, అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈవోలకు సీఈఓ సూచించారు.ఓటర్ల జాబితా సవరణలో భాగంగా పెద్ద సంఖ్యలో ఫారం-7 దరఖాస్తులు సమర్పిస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చినట్లు సీఈఓ తెలిపారు. వీటిలో కొన్ని దరఖాస్తులు నిజమైనవి కావన్న ఆరోపణలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
విచారణ తర్వాతే చర్యలు
ఫారం-6, 6ఏ, 7, 8లో కావాలనే తప్పుడు సమాచారం లేదా ప్రకటన ఇచ్చిన వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 31 ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇందుకు ముందు 1960 నాటి ఓటర్ల నమోదు నిబంధనల్లోని రూల్-20 ప్రకారం విచారణ నిర్వహించాలని స్పష్టం చేశారు.
ముషీరాబాద్‌లో మొదటి ఘటన
హైదరాబాద్‌లో ప్రీ-ప్రింటెడ్ ఫారం-7ల వ్యవహారం అక్టోబర్ 1న ముషీరాబాద్ నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చింది. 31 మంది ఓటర్ల పేర్లను తొలగించాలని కోరుతూ ముందుగానే ముద్రించిన ఫారం-7లను సమర్పించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. తొలగింపు జాబితాలో కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయని ఆ పార్టీ పేర్కొంది.
బహదూర్‌పురా, గోషామహల్‌లోనూ..
బహదూర్‌పురా నియోజకవర్గంలోనూ ఇలాంటి ప్రీ-ప్రింటెడ్ ఫారం-7 ఒకటి బయటపడింది. ఈ వ్యవహారాన్ని కూడా టీపీసీసీ ఎన్నికల విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.గోషామహల్ నియోజకవర్గంలోని 173వ బూత్లోనూ పెద్ద సంఖ్యలో ముందే ముద్రించిన ఫారం-7లు సమర్పించే ప్రయత్నం జరిగినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అయితే వాటిని స్వీకరించేందుకు బూత్ స్థాయి అధికారి నిరాకరించి, ఈ విషయాన్ని ఈఆర్ఓ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు
ప్రీ-ప్రింటెడ్ ఫారం-7లను ఉపయోగించి ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ టీపీసీసీ ఎన్నికల విభాగం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. బాధ్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని కోరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సీఈఓ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

