Telangana DGP | పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులపై డీజీపీ కీలక హామీ

  • పంతాలకు పోయి కోర్టుల్లో కేసులు వేసుకొని నష్టపోవద్దు
  • 37 అదనపు ఎస్పీ పోస్టులు వెంటనే భర్తీ చేస్తాం
  • తండ్రిలా న్యాయం చేస్తా.. పెద్దన్న పాత్ర పోషిస్తా
  • డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ డీజీపీగా పదోన్నతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో పెద్దన్న పాత్ర పోషిస్తానని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. అనవసరంగా పంతాలకు పోయి కోర్టుల్లో కేసులు వేసుకొని నష్టపోవద్దని ఆయన సూచించారు. దశాబ్దాలుగా పదోన్నతుల విషయంలో కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు తాను బాధ్యత తీసుకొని ముందుకు వచ్చానని తెలిపారు.

గురువారం డీజీపీ కార్యాలయ ఆవరణలో 1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన డీఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో సీవీ ఆనంద్ మాట్లాడారు. డీఎస్పీల నుంచి అదనపు ఎస్పీలుగా పదోన్నతుల విషయంలో మూడు బ్యాచ్‌లకు చెందిన అధికారులు న్యాయస్థానాల్లో కేసులు వేయడంతో పదోన్నతుల ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోందన్నారు. ప్రస్తుతం 37 అదనపు ఎస్పీ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, కోర్టు కేసుల కారణంగా పదోన్నతులు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు.

కోర్టుల్లో కేసులు వేసుకొని నష్టపోవద్దని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు డీజీపీ స్థానంలో ఉన్న తాను తండ్రి పాత్ర పోషించి అందరికీ న్యాయం చేసేందుకు బాధ్యత తీసుకుంటున్నానని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

కేసులు విరమించుకోండి.. పదోన్నతులు ఇస్తా

ఇప్పటివరకు కోర్టుల్లో వేసుకున్న కేసులన్నింటినీ విరమించుకుంటే వెంటనే అదనపు ఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 37 అదనపు ఎస్పీ పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని తెలిపారు. వచ్చే ప్యానల్‌ ఇయర్‌లో మరికొంతమంది అధికారులకు కూడా పదోన్నతులు వస్తాయని వెల్లడించారు.

పంతాలకు పోతే నష్టపోతారు..

పంతాలకు పోయి కోర్టు కేసులను విరమించుకోకపోతే నష్టపోతారని సీవీ ఆనంద్ హెచ్చరించారు. అనుకూలంగా తీర్పులు తెచ్చుకుంటామని భావించవద్దని సూచించారు. ఒక బ్యాచ్‌కు చెందిన అధికారులకు నష్టం కలిగే పరిస్థితి ఏర్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ పదోన్నతులు ఇవ్వబోనని స్పష్టం చేశారు.

కేసులన్నీ విరమించుకుంటాం.. డీజీపీకి అధికారుల లేఖ..

సమావేశంలో పాల్గొన్న వరంగల్‌ జోన్‌కు చెందిన మూడు బ్యాచ్‌ల అధికారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తాము కోర్టుల్లో వేసిన కేసులన్నింటినీ విరమించుకుంటామని పేర్కొంటూ డీజీపీకి లేఖ అందజేశారు. డీజీపీపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని, అందువల్ల కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటామని వారు తెలిపారు.

హైదరాబాద్‌ సిటీకి చెందిన అధికారులు కొంత తర్జనభర్జన అనంతరం కేసుల విరమణకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో పదోన్నతుల సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఏర్పడింది. ఈ నెలాఖరులోపు 37 మంది అధికారులకు అదనపు ఎస్పీలుగా పదోన్నతులు రానున్నట్లు సమాచారం.

Telangana DGP